రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:07 PM
ఎదురెదురుగా ప్రయాణిస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు, మోటార్ సైకిల్ ఢీకొన్న ఘటనలో బీటెక్ విద్యార్థి మృతిచెందాడు.
కొత్తూరు సమీపంలో బైక్‌ను ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు
పెద్దదోర్నాల,సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ఎదురెదురుగా ప్రయాణిస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు, మోటార్ సైకిల్ ఢీకొన్న ఘటనలో బీటెక్ విద్యార్థి మృతిచెందాడు. కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి కొత్తూరు సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెకు చెందిన ఈడగొట్టు జశ్వంత్(21) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జశ్వంత్ మార్కాపురంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. జశ్వంత్ సొంతపని మీద బైకుపై కర్నూలు వెళ్లి తిరిగి మార్కాపురం వస్తుండగా దోర్నాల మండలం కొత్తూరు వద్దకు రాగానే శ్రీశైలం నుంచి వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం బళ్లారి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. జశ్వంత్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై మహేష్ సిబ్బందితో వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.