Share News

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇరువురు ఎంపిక

ABN , Publish Date - Sep 03 , 2025 | 11:06 PM

గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయులలో అద్దంకి మండలానికి చెందిన ఇద్దరు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇరువురు ఎంపిక

జిల్లా అవార్డులకు పలువురు ఎంపిక

అద్దంకిటౌన్‌, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి) : గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయులలో అద్దంకి మండలానికి చెందిన ఇద్దరు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. మండలంలోని తిమ్మాయపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఏ తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న డాక్టర్‌ జాగర్లమూడి ప్రతాప్‌, పట్టణంలోని ఎంపీయూపీఎ్‌సలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న మానికొండ ధనలక్ష్మి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు పలువురు ఎంపికయినట్లు ఎంఈవో-2 శ్రీనివాసరావు తెలిపారు. అద్దంకి పట్టణలోని శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న డీఎస్‌ పద్మావతి జిల్లా స్థాయి ఉత్తమ ప్రాధానోపాధ్యాయురాలు అవార్డుకు ఎంపికయ్యారు. తిమ్మయపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఏ(పీఎస్‌) ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఆర్‌. శ్రీనివాసరరావు, చక్రాయపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఏ(ఇంగ్లీష్‌) ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న బి. చిన్న అంకారావు, మండలంలో మోదేపల్లి ఎంపీపీఎ్‌స(మెయిన్‌)లో ఎస్‌జీటీగా పని చేస్తున్న యు. రాజశేఖర్‌రావులు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయినట్లు ఆయన తెలిపారు.

యద్దనపూడి మండలంలో...

యద్దనపూడి/మార్టూరు, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఇద్దరు ఉపాధ్యాయులు జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. వారిలో పూనూరు జడ్‌పీ హైస్కూలులో ఎస్‌ఏ అంకరాజు, సూరవరపుపల్లిలోని ఎస్సీ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న శారదలు ఎంపికయ్యారు.


పంగులూరు మండలంలో...

పంగులూరు, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండమంజులూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం అణిత, చందలూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పీడీ ప్రతిమలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. కొండమంజులూరు ఉన్నత పాఠశాల విద్యార్థిని పంచుమర్తి భవ్యశ్రీ జాతీయస్థాయిలో జరిగిన పోస్టర్‌ కాంపిటేషన్‌లో ప్రథమస్థానం సాధించడంలో హెచ్‌ఎం అణిత ప్రోత్సాహం ఉంది. అదేవిధంగా వ్యాయామోపాధ్యాయిని ప్రీతి చందలూరు ఉన్నత పాఠశాల విద్యార్థులను యోగాక్రీడలో ఉత్తమ శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయస్థాయిలో పాఠశాలకు గుర్తింపు తెచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయిన వీరిని ఎంఈవోలు నాగభూషణం, వీరాంజనేయులు అభినందించారు.

ఇంకొల్లు మండలంలో...

ఇంకొల్లు,సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : మండలంలో ఇద్దరు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. దుద్దుకూరు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉప్పల చెంచయ్య, నాగండ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ సైన్సు ఉపాధాయులుగా పనిచేస్తున్న కూసం రమేష్‌ జిల్లా విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రకటించింది. వీరికి ఈ నెల 5వ తేదీన బాపట్లలో కలెక్టరు, డీఈవో చేతుల మీదగా అవార్డులు అందుకోనున్నారు. వీరి ఎంపిక పట్ల యూటీఎఫ్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు పేర్ని సత్యనారాయణ, షేక్‌ మస్తాన్‌వలి అభినందనలు తెలిపారు.

Updated Date - Sep 03 , 2025 | 11:06 PM