బోగస్ బాగోతం బయటపడుతోంది!
ABN , Publish Date - Nov 30 , 2025 | 01:09 AM
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) కార్యాలయంలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నగరంలోని కేశవస్వామిపేటకు చెందిన యానాది సామాజికవర్గానికి చెందిన పలు పొదుపు సంఘాల బాధ్యతను చూసేఆర్పీ దివ్యశాంతిపై బాధితులు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.
మెప్మాలో కొనసాగుతున్న విచారణ
ఒంగోలు కార్పొరేషన్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) కార్యాలయంలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నగరంలోని కేశవస్వామిపేటకు చెందిన యానాది సామాజికవర్గానికి చెందిన పలు పొదుపు సంఘాల బాధ్యతను చూసేఆర్పీ దివ్యశాంతిపై బాధితులు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఇప్పటికే ఎస్టీ సామాజికవర్గం మహిళలకు జరిగిన అన్యాయంపై మెప్మా ఎండీ కార్యాలయం నుంచి ఐదుగురు సభ్యుల కమిటీ ఒంగోలు వచ్చి విచారణ చేపట్టింది. మరోవైపు కలెక్టర్ ఆదేశాలతో జేసీ గోపాలకృష్ణచైర్మన్‌గా విచారణ కొనసాగుతోంది. పీడీ శ్రీహరి ఆధ్వర్యంలో మరో విచారణ కమిటీని నియమించారు. ఈ మేరకు పీడీ విచారణ కమిటీ శనివారం స్థానిక దేవుడు చెరువులో విచారణ చేసింది. మూడు గ్రూపులకు ఒక ఆర్పీని నియమించగా ఐబీ స్పెషలిస్ట్ ఫణికుమారి, సీఎంఎం సంతోష్, సీవో మరియమ్మ విచారణ చేశారు. వారి ఎదుట బాధిత మహిళలు గోడు వెళ్లబోసుకున్నారు. తమకు తెలియకుండా తమ పేరుతో రూ.లక్షల నిధులు బ్యాంకుల నుంచి రుణాల రూపంలో డ్రా చేసుకున్నట్లు వెల్లడించారు. గత కొన్ని నెలలుగా ఈ వ్యవహారం నడుస్తున్నా తమకు తెలియదన్నారు. సమావేశాలు నిర్వహించి, ఆధార్ కార్డులు తీసుకున్నారని.. వాటితో బోగస్ పొదుపు గ్రూపులు సృష్టించారని ఫిర్యాదు చేశారు. బ్యాంకర్లు వచ్చే వరకు తమకు తెలియదన్నారు. తమకు న్యాయం చేయాలని వారు విచారణ కమిటీ ఎదుట వాపోయారు. మొదట్లో వాస్తవాలు చెప్పేందుకు కొందరు పొదుపు సభ్యులు వెనుకంజ వేయగా, ఆ తర్వాత ఒక్కొక్కరుగా తాము నష్టపోయిన వైనాన్ని వివరించారు. ఇప్పటికైనా ఆర్పీగా ఆమెను తొలగించాలని, అలాగే తమ పేరుతో తీసుకున్న రుణాలను తిరిగి వసూలు చేసి తమను రుణ విముక్తులను చేయాలని కోరారు. ఈ సందర్భంగా విచారణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆదివారం కూడా విచారణ కొనసాగుతుందన్నారు. అనంతరం నివేదికను పీడీకి అందజేస్తామని తెలిపారు.