Share News

సామాజిక తనిఖీలపై నీలినీడలు

ABN , Publish Date - Sep 15 , 2025 | 10:50 PM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల అమలులో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు.

సామాజిక తనిఖీలపై నీలినీడలు
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్‌)

పేరుకు మాత్రమే ప్రజావేదిక ఫ భారీగా వెలుగుచూస్తున్న అక్రమాలు

సామాజిక తనిఖీలపై నీలినీడలు

పెద్దారవీడు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల అమలులో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో పెద్దారవీడు మండలంలో జరిగిన పనుల పరిశీలనకు సంబంధించిన సామాజిక తనిఖీలపై నీలినీడలు కమ్ముకున్నాయి. అప్పుడు పనిచేసిన సిబ్బంది పనుల విచారణకు వచ్చినవారితో తెరవెనుక ఒప్పందాల మేరకు విచారణ నామమాత్రంగా చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

పేరుకే సామాజిక తనిఖీలు

మండలంలో 2024-25కి సంబంధించిన సామాజిక తనిఖీలు పేరుకు మాత్రమే చేసి మమ అనిపించుకున్నారు. మండలంలోని 19 పంచాయతీల పరిధిలో ఆ ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద సుమారు రూ.20కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు రికార్డులు దాఖలయ్యాయి. వాస్తవానికి అంతమొత్తంలో ఎక్కడా పనులు జరిగినట్లు లేదు. వాటిని నిర్ధారించడానికి జరిగిన సామాజిక తనిఖీల్లో కొందరు ఉద్యోగులు నిబద్ధతతో పనిచేశారు. వారి తనిఖీలో కొన్నిచోట్ల పనులు చేయనట్లు, ఆయా పనులకు దొంగ మస్టర్లు తయారు చేసినట్లు వెల్లడైంది. కానీ ఎక్కువ చోట్ల తనిఖీలు చేయడానికి వచ్చిన సిబ్బంది, ఆ పనులు జరిగిన సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేసిన సిబ్బందితో లాలూచీ పడి తప్పుడు నివేదికలను సమర్పించినట్లు సమాచారం. అసలు కొన్ని గ్రామ పంచాయతీలలో సామాజిక తనిఖీ చేస్తున్నట్లు లబ్ధిదారులకు కూడా తెలియకపోవడం సర్వే తీరుకు నిదర్శనం.

రూ.2 కోట్ల మేర అక్రమాల జరిగినట్లు నిర్ధారణ

మండలంలోని 19 పంచాయతీల్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి పనుల్లో సుమారు రూ.2 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీల్లో వెలుగుచూసినట్లు సిబ్బంది అంచనాకు వచ్చినట్లు సమాచారం. పూర్తిస్థాయిలో విచారణ చేసిన అనంతరం అక్రమాలకు బాధ్యుల నుంచి నగదును రికవరీ చేయడంతోపాటు, వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఉన్నతాఽధికారులు ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

Updated Date - Sep 15 , 2025 | 10:50 PM