సామాజిక తనిఖీలపై నీలినీడలు
ABN , Publish Date - Mar 12 , 2025 | 10:52 PM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల అమలులో వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అధికారులు సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. ఆ పనుల్లో అవినీతి జరిగిందా, లేదా అని నిర్ధారిస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పెద్దారవీడు మండలంలో జరిగిన పనుల పరిశీలనకు సంబంధించిన సామాజిక తనిఖీలపై అనుమానాలు ముసురుకున్నాయి.

2023-24లో చేపట్టిన ఉపాధి పనుల్లో భారీ అక్రమాలు
పరిశీలనకు వచ్చిన సిబ్బంది క్షేత్రస్థాయిలో లాలూచీ?
తప్పుడు నివేదికల సమర్పణ
పేరుకు మాత్రమే ప్రజావేదిక
పెద్దారవీడు మండలంలో రూ.2 కోట్ల మేర అవినీతి : పీడీ
పెద్దారవీడు, మార్చి 12(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల అమలులో వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అధికారులు సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. ఆ పనుల్లో అవినీతి జరిగిందా, లేదా అని నిర్ధారిస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పెద్దారవీడు మండలంలో జరిగిన పనుల పరిశీలనకు సంబంధించిన సామాజిక తనిఖీలపై అనుమానాలు ముసురుకున్నాయి. తనిఖీలలో వెల్లడైన అంశాలను చర్చించేందుకు బుధవారం పెద్దారవీడు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సైతం వెలవెలబోయింది. అధికారులు రాక, ప్రజలు లేక తనిఖీల ప్రధాన ఉద్దేశ్యం నీరుగారిపోయిందని కొందరు విమర్శిస్తున్నారు.
పేరుకే సామాజిక తనిఖీలు
మండలంలో 2023-24కు సంబంధించిన సామాజిక తనిఖీలు పేరుకుమాత్రమే చేసి మ.మ అనిపించుకున్నారు. మొత్తం 19 పంచాయతీల పరిధిలో ఉపాధి హామీ పథకం కింద 519 పనులకు రూ.17 కోట్ల మేర చెల్లించినట్లు రికార్డులు చేశారు. వాస్తవానికి అంతమొత్తంలో ఎక్కడా పనులు జరిగినట్లు ఆనవాళ్లు లేవు. సామాజికతనిఖీలో కొన్నిచోట్ల పనులు చేయనట్లు, చేసిన పనులకు సైతం దొంగ మస్టర్లు వేసినట్లు గుర్తించారు. ఎక్కువచోట్ల తనిఖీలు చేయడానికి వచ్చిన సిబ్బంది, ఆ పనులు జరిగిన సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేసిన సిబ్బందితో లాలూచీ పడి తప్పుడు నివేదికలను సమర్పించినట్లు సమాచారం. అసలు కొన్ని గ్రామపంచాయతీలలో సామాజిక తనిఖీ చేస్తున్నట్లు లబ్ధిదారులకు కూడా తెలియకపోవడం గమనార్హం.
రూ.2 కోట్ల మేర అవినీతి
మండలంలోని 19 పంచాయతీలలో జరిగిన ఉపాధి పనుల్లో సుమారు రూ.2 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీల్లో వెలుగుచూసిందని పీడీ జోస్‌ఫకుమార్ చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం అక్రమాలకు బాధ్యుల నుంచి నగదును రికవరీ చేయడంతోపాటు, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జాన్ సుందరం, ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స సిబ్బంది పాల్గొన్నారు.