Share News

నల్లబర్లీని పూర్తిగా కొనుగోలు చేయాలి

ABN , Publish Date - May 20 , 2025 | 11:18 PM

రైతులు పండించిన నల్లబర్లీ పొగాకు తక్షణమే కొనుగోలు చేయాలని రాష్ట్ర రైతుసంఘం పూర్వ ప్రధాన కార్యదర్శి నాగబోయిన రంగారావు డిమాండ్‌ చేశారు

నల్లబర్లీని పూర్తిగా కొనుగోలు చేయాలి
బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఏలూరి

పలు మండలాల్లో రైతుల ధర్నాలు

తహసీల్దార్లకు వినతిపత్రాల అందజేత

పర్చూరు/కారంచేడు/పంగులూరు/మార్టూరు, మే 20 (ఆంధ్రజ్యోతి) : రైతులు పండించిన నల్లబర్లీ పొగాకు తక్షణమే కొనుగోలు చేయాలని రాష్ట్ర రైతుసంఘం పూర్వ ప్రధాన కార్యదర్శి నాగబోయిన రంగారావు డిమాండ్‌ చేశారు. నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతుసంఘం, కౌలు రైతుసంఘం ప్రతినిధులు స్థానిక రైతులతో కలసి పంగులూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ బర్లీ సాగును ప్రోత్సహించిన కంపెనీలు కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. పొగాకు కంపెనీలు పూర్తిగా కొనుగోలు చేయాలని, లేకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ధర్నా శిబిరం వద్దకు వచ్చిన తహసీల్దార్‌ సింగారావు రైతుసంఘం ప్రతినిధులతో సమస్యను చర్చించారు. అనంతరం జీపీఐ కంపెనీ ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడి పొగాకు రైతుల ఇబ్బందిని గుర్తించి, కొనుగోలుకు చర్యలు చేపట్టాలని కోరారు. కంపెనీ ప్రతినిధితో నాగబోయిన రంగారావు మాట్లాడుతూ రైతులు పండించి నిల్వ ఉంచిన పొగాకు కంపెనీలు కొనుగోలు చేయాలని, పంగులూరు లేదా ఇంకొల్లులో కేంద్రంగా పొగాకు కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బర్లీ పొగాకు 75 మిలియన్‌ కేజీలు ఉందని, అధికారిక లెక్కలు చెబుతుంటే, ప్రభుత్వం 20 మిలియన్‌ కేజీల పొగాకు కొనుగోలు చేయాలని కంపెనీలకు చెప్పడం విడ్డూరంగా ఉందని కౌలు రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు వినోద్‌బాబు చెప్పారు. కంపెనీలు పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేలా ప్రభుత్వం కార్యాచరణ అమలుకు చర్యలు చేపట్టాలని కోరారు. నల్లబర్లీ పొగాకు కంపెనీల ద్వారాకాని, మర్క్‌ఫెడ్‌ ద్వారాకాని కొనుగోలు చేయాలని కోరుతూ తహసీల్దార్‌ సింగారావుకు వినతిపత్రం అందచేశారు. ధర్నా కార్యక్రమంలో జిల్లా రైతుసంఘం ప్రధాన కార్యదర్శి తలపనేని రామారావు, వినోద్‌, ఆదుంసాహెబ్‌, పంగులూరు పరిసర గ్రామాల రైతులు పాల్గొన్నారు.

యద్దనపూడి మండల తహసీల్దారు కె రవికుమార్‌కు రైతు సంఘం నాయకులు ఒక వినతిపత్రం అందజేశారు. పొగాకు కొనుగోలు చేయాలంటూ నిరసన తెలిపిన కార్యక్రమంలో బత్తుల హనుమంతరావు, ఈదల శ్రీను, వీరవల్లి కృష్ణ మూర్తి, వై హనుమంతరావు, వై శేషాద్రి పాల్గొన్నారు.

పర్చూరు బొమ్మల సెంటర్‌లో పొగాకు కొనుగోళ్లపై నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కౌలు రైతుసంఘం కార్యదర్శి చింతలపూడి గంగయ్య, సీపీఎం నాయకులు మత్తే డేవిడ్‌, షేక్‌ రహీం, రైతులు పాల్గొన్నారు.

కారంచేడులో రైతు సంఘం, కౌలు రైతుసంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నల్లబర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని రైతులతో కలసి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండయ్య, పి.ఏడుకొండలు, శ్రీనివాసరావు, ఆవుల మంద వెంకటేశ్వర్లు, పి.శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.


పొగాకు బోర్డు చైర్మన్‌తో ఎమ్మెల్యే ఏలూరి భేటీ

మార్క్‌ఫెడ్‌ ద్వారా నల్లబర్లీ పొగాకును కొనుగోలు చేయండి

ప్రభుత్వానికి నివేదక అందించిన సాంబశివరావు

పర్చూరు, మే 20 (ఆంధ్రజ్యోతి) : టుబాకో బోర్డ్‌ చైర్మన్‌ సిహెచ్‌. యశ్వంత్‌తో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు భేటీ అయ్యారు. నల్లబర్లీ పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కంపెనీలు కొనుగోలు చేయకపోవటంపై ఇటీవల ఎమ్మెల్యే ఏలూరి ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో భేటీ నిర్వహించి పొగాకు కంపెనీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయినా కంపెనీలు పంట కొనుగోలు చేయకపోవటంతో ఎమ్మెల్యే ఏలూరి పట్టువిడవకుండా వివిధ మార్గాల ద్వారా కంపెనీలతో ప్రభుత్వం పై నుంచి ఒత్తిడి తీసుకువస్తున్నారు. పొగాకు సమస్యపై ఎమ్మెల్యే ఏలూరి ప్రభుత్వానికి ఒక ప్రత్యేక నివేదిక సైతం అందజేశారు. ఈఅంశంపై పంటల కొనుగోలకు సంబంధించి మంత్రుల కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలి

మార్క్‌ఫెడ్‌ ద్వారా నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి ప్రభుత్వాన్ని కోరారు. క్యాబినెట్‌ కమిటీ సమావేశంలో పొగాకు కొనుగోలుకు సంబంధించి కంపెనీలకు కొంత సమయం ఇచ్చి చూద్దామని, ఆ తర్వాత ఏమిచేయాలో నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు తెలిసింది. పొగాకు రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఏలూరి తెలిపారు.

Updated Date - May 20 , 2025 | 11:18 PM