Share News

రైలింగ్‌ను ఢీకొన్న బైక్‌.. ఇద్దరు యువకుల దుర్మరణం

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:26 PM

ద్విచక్ర వాహనం అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం అండర్‌పాస్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

రైలింగ్‌ను ఢీకొన్న బైక్‌..  ఇద్దరు యువకుల దుర్మరణం

గుంటూరు జిల్లాలో ఘటన

ఇరువురూ తాళ్లూరు మండలం తూర్పుగంగవరం వాసులు

తాళ్లూరు/గుంటూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ద్విచక్ర వాహనం అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం అండర్‌పాస్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగం, హెల్మెట్‌ ధరించకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మృతులిద్దరూ తాళ్లూరు మండలం తూర్పుగంగరం ఎస్సీకాలనీకి చెందిన వారు కాగా.. అందులో ఒకరు మైనర్‌. నల్లపాడు పోలీసుల కథనంమేరకు.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పుగంగవరం గ్రామానికి చెందిన చాట్ల అభిషేక్‌ (19), చాట్ల నాని (16) సమీప బంధువులు. శనివారం ద్విచక్ర వాహనంపై పెదకాకానిలోని ఓ ప్రార్థనా మందిరానికి వచ్చిన ఈ ఇద్దరూ రాత్రి అక్కడే నిద్ర చేశారు. ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్తుండగా.. దాసరిపాలెం అండర్‌ పాస్‌ వద్ద జాతీయ రహదారిపై రైలింగును అతివేగంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో అభిషేక్‌, నాని అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న నల్లపాడు సీఐ వంశీధర్‌, ఎస్‌ఐ నారాయణరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుల సెల్‌ఫోన్‌ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అభిషేక్‌ గ్రామంలో ఎలక్ట్రికల్‌ పనిచేస్తుంటాడు. అతని తల్లిదండ్రులు జేమ్స్‌,ఝాన్సీ కూలీపనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అభిషేక్‌ ఇద్దరు చెల్లెల్లు చదువుకుంటున్నారు. నాని తండ్రి ఏసోబు ఎలక్ర్టీషియన్‌ కాగా, తల్లి లింగమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అతనికి ఇద్దరు సోదరులు, అక్క ఉన్నారు. నానీ హైదరాబాద్‌లో బేల్దారి పనులకు వెళ్లి క్రిస్మ్‌సకు ఇంటికి వచ్చాడు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం చెందడంతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. తూర్పుగంగవరం ఎస్సీ కాలనీలో విషాదచాయలు అలముకున్నాయి.

Updated Date - Dec 28 , 2025 | 11:26 PM