Share News

పంతుళ్లకు పెద్దకష్టం

ABN , Publish Date - Jul 20 , 2025 | 01:28 AM

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పెద్ద కష్టం వచ్చిపడనుందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవునేనని సమాధానం ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన సన్న బియ్యాన్ని బడులకు తీసుకెళ్లే భారం ఉపాధ్యాయులపైనే పడనుంది.

పంతుళ్లకు పెద్దకష్టం

సన్నబియ్యం తీసుకెళ్లే బాధ్యత వారిదే!

అభ్యంతరం తెలిపిన ఎంఈవోలు

భగ్గుమంటున్న ఉపాధ్యాయ లోకం

ఒంగోలు విద్య, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పెద్ద కష్టం వచ్చిపడనుందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవునేనని సమాధానం ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన సన్న బియ్యాన్ని బడులకు తీసుకెళ్లే భారం ఉపాధ్యాయులపైనే పడనుంది. శుక్రవారం మండల విద్యాధికారుల-2తో డీఈవో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పౌరసరఫరాలశాఖ అధికారి మాట్లాడుతూ ఆగస్టు నుంచి పాఠశాలలకు సన్న బియ్యాన్ని టీచర్లే తీసుకెళ్లాల్సి ఉంటుందని బాంబు పేల్చారు. ఈ ప్రతిపాదనపై సమావేశానికి హాజరైన ఎంఈవోలు అభ్యంతరం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న టీచర్లు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మునిసిపల్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు డొక్కా సీతమ్మ మఽధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. జిల్లాలోని 2,500 పాఠశాలల్లో సుమారు 1.81లక్షల మందికి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. గత ఏడాది వరకు అందుకు అవసరమైన బియ్యన్ని గ్రామాల్లోని రేషన్‌ షాపుల ద్వారా పాఠశాలలకు సరఫరా చేసేవారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సన్న బియ్యంతో పెడుతున్నారు. అవి దుర్వినియోగం కాకుండా మండలస్థాయి స్టాక్‌ పాయింట్‌ నుంచి డీలర్‌కు సంబంధం లేకుండా నేరుగా పాఠశాలలకు అందిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. చిన్నచిన్న పాఠశాలలకు కూడా వాహనం వెళ్లి బియ్యం దించి రావాలంటే దూరాభారమవుతోంది. దీంతో పాఠశాల పాయింట్‌కు తమ వాహనం వెళ్లినప్పుడు అవి మూసివేసి ఉండటంతోపాటు హెచ్‌ఎంలు అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని బియ్యం సరఫరా కాంట్రాక్టర్‌ జేసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బియ్యాన్ని క్లస్టర్‌ పాఠశాలలో దించితే అక్కడి నుంచి టీచర్లు తమ పాఠశాలలకు తీసుకెళ్లాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై ఎంఈవోలు అభ్యంతరం తెలిపారు.

క్లస్టర్‌ పాయింట్‌ నుంచి అంటే కష్టమే..

ప్రస్తుతం టీచర్లలో ఎక్కువ మంది మహిళ లు ఉన్నారు. ఏకోపాధ్యాయ స్కూళ్లు ఉన్నాయి. ఈ టీచర్లు క్లస్టర్‌ నుంచి బియ్యం తీసుకెళ్లా లంటే అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. తమను బోధనేతర పనుల నుంచి విముక్తుల్ని చేసి కేవలం చదువుకే పరిమితం చేయాలని ఒకవైపు వేడుకుంటుంటే మరోవైపు కొత్తగా సన్నబియ్యం తీసుకెళ్లే బాధ్యతను నెత్తిన పెట్టడం ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రతిపాదనపై జాయింట్‌ కలెక్టర్‌ను కలిసి సమస్యలను వివరించాలని ఎంఈవోలు నిర్ణయించారు. జిల్లా విద్యాశాఖాధికారితో కలిసి సోమవారం జేసీ వద్దకు వెళ్లాలని భావిస్తున్నారు.

Updated Date - Jul 20 , 2025 | 01:28 AM