జనవరిలోగా విద్యార్థులందరికీ సైకిళ్లు
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:53 AM
నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులందరికీ జనవరిలోగా ఉచితంగా సైకిళ్లు అందజేస్తామని రాష్ట్ర విద్యుత్‌ఽశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.
మంత్రి గొట్టిపాటి
పంగులూరు, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులందరికీ జనవరిలోగా ఉచితంగా సైకిళ్లు అందజేస్తామని రాష్ట్ర విద్యుత్‌ఽశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మండలంలోని బూదవాడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 191 మంది బాల, బాలికలతోపాటు ప్లస్ 2 విద్యార్థులు 19మందికి మంత్రి రవికుమార్ సైకిళ్లను పంపిణీ చేశారు. పాఠశాల హెచ్‌ఎం రఘురామయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మేఘా సంస్థ, మోర్ ఫౌండేషన్ సమకూర్చిన సీఎ్‌సఆర్ నిధులతో 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న యూనిఫాం, పుస్తకాలు, భోజన నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
11 పాఠశాలలకు సైకిళ్లు పంపిణీ
నియోజకరవర్గంలో ఇప్పటివరకు 11 పాఠశాలల విద్యార్థులకు సైకిళ్లు అందజేశామని మంత్రి చెప్పారు. త్వరలో కొండమంజులూరు ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్ట్ అసోసియేట్ డైరెక్టర్ విష్ణుప్రియ, ఎంపీడీవో స్వరూపారాణి, తహసీల్దార్ సింగారావు, ఎంఈవో వీరాంజనేయులు, ఏఈ హనుమంతరావు, సుమంత్, మండల టీడీపీ అధ్యక్షుడు రావూరి రమేష్, కొమ్మారెడ్డి సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాయకులు కె.వి.సుబ్బారావు, బాలిన రామసుబ్బారావు, కుక్కపల్లి ఏడుకొండలు, చింతల సహదేవుడు, నార్నె సుబ్బారావు, ఓబుల్‌రెడ్డి, ఆదిరెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షులు అంజిరెడ్డి, బ్రహ్మానందస్వామి, సింగరకొండ, గొల్లపూడి అంజయ్య, చిలుకూరి కోటయ్య, అజిత్‌ట్ర్‌స్ట చైర్మన్ వీరనారాయణ పాల్గొన్నారు.
వీధిదీపాలు వెంటనే ఏర్పాటు చేయండి : మంత్రి ఆదేశం
మండలంలోని బూదవాడలోని ధనలక్ష్మీ కాలనీ నుంచి గ్రామంలోకి వచ్చే రహదారిలో వీధిదీపాలు తక్షణమే ఏర్పాటుచేయాలని డిప్యూటీ ఎంపీడీవో సుమంత్‌ను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. బూదవాడ వచ్చిన మంత్రికి గ్రామస్థులు, రైతులు తమ సమస్యలను వివరించారు. అలాగే గ్రామపొలాలకు వెళ్లే డొంకరహదారుల అభివృద్ధికి చర్యలు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు. ఈనెల 5నుంచి 7వ తేదీవరకు ద్వారకాతిరుమలలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీలలో ప్రథమ, ద్వితీయస్థానం సాధించిన చందలూరు ఉన్నత పాఠశాల విద్యార్థినులు లిఖిత, శ్రుతిని మంత్రి గొట్టిపాటి అభినందించారు. జాతీయస్థాయి పోటీలలో రాణించాలని ఆకాంక్షించారు.
సొసైటీలకు ఎరువులు కొరత లేకుండా అందించాలి
రైతుకు అవసరమైన ఎరువులు కొరత లేకుండా అందేలా చర్యలు చేపట్టాలని మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. సొసైటీలకు యూరియా, డీఏపీ లాంటి ఎరువులు పూర్తిగా అందజేయాలన్నారు. ఎరువులు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.