పోలీసులను నమ్మించి.. బురిడీ కొట్టించి..
ABN , Publish Date - Apr 10 , 2025 | 10:46 PM
దొంగతనాలు చేయడంలో అతను ఆరితేరిన క్రిమినల్.. చిన్నవయస్సు నుంచే చిల్లర దొంగతనాలు చేస్తూ పట్టుబడ్డ చరిత్ర ఉంది. ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో అతనిపై షీటు కూడా ఉంది. తాను చోరీలు చేయడం మానేశానని పోలీసులతో నమ్మించి చెలిమి చేశాడు. ఇతర దొంగల గురించి పోలీసులకు సమాచారమిచ్చేవాడు. దీంతో పోలీసులు కాస్త సడలింపు ఇచ్చారు. అదే అదునుగా భావించి రెండు నెలలుగా ఒంగోలు పరిసరాలలో 15 నుంచి 20 దొంగతనాలకు పాల్పడ్డాడు

పాత దొంగ ఇన్‌ఫార్మర్‌గా ఉంటూ రెండు నెలలో పలు దొంగతనాలు
అదుపులో మోస్ట్‌వాంటెడ్?
ఒంగోలు క్రైం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) : దొంగతనాలు చేయడంలో అతను ఆరితేరిన క్రిమినల్.. చిన్నవయస్సు నుంచే చిల్లర దొంగతనాలు చేస్తూ పట్టుబడ్డ చరిత్ర ఉంది. ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో అతనిపై షీటు కూడా ఉంది. తాను చోరీలు చేయడం మానేశానని పోలీసులతో నమ్మించి చెలిమి చేశాడు. ఇతర దొంగల గురించి పోలీసులకు సమాచారమిచ్చేవాడు. దీంతో పోలీసులు కాస్త సడలింపు ఇచ్చారు. అదే అదునుగా భావించి రెండు నెలలుగా ఒంగోలు పరిసరాలలో 15 నుంచి 20 దొంగతనాలకు పాల్పడ్డాడు. కొన్నిచోట్ల దొరికిన సీసీ ఫుటేజీ, ఫింగర్ ప్రింట్ ఆధారంగా చోరీ చేసింది చిడితోటి మధుగా గుర్తించారు. అతను పేర్నమిట్ట గ్రామంలోని కొండ కింద ఉంటాడు. అంతేకాదు తాను దైవభక్తిలో మునిగిపోయానని ఇంటి వద్ద ఓ చిన్న గుడి కూడా కట్టించాడు. దొంగిలించిన సామగ్రిని ఆ గుడిలో దాచిపెడుతూ పైకి తాను మార్పు చెందానని ఐడీ పార్టీ పోలీసులను నమ్మించాడు. దీంతో అతని కదలికలపై పోలీసులు దృష్టి పెట్టడం మానేశారు.అదే అదునుగా తాళ్లూరు, అద్దంకి, కందుకూరు తదితర ప్రాంతాలలో చోరీ చేసిన సొత్తును గుడిలో దాచి పెట్టాడు. అంతే కాకుండా వెంగముక్కలపాలెం వెళ్లే దారిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ కొంత సామగ్రి దాచాడు. ఇలా దొంగ సొత్తు దాచి పెడుతున్నా ఒంగోలు పోలీసులకు ఏ మాత్రం అనుమానం రాలేదు. తాళ్లూరు పోలీసు స్టేషన్ పరిధిలో చోరీల గురించి విచారణ కోసం పేర్నమిట్ట వచ్చిన పోలీసులకు మధు ఇంట్లో దొంగిలించిన సామాగ్రి కనిపించింది. దీంతో ఆ సామగ్రిని తీసుకెళ్లేందుకు తాళ్లూరు పోలీసులు ఒంగోలులో ఉన్న సీసీఎస్ పోలీసులకు సమాచారం ఇచ్చి తీసుకెళ్లారు. అప్పటి నుంచి మధు కోసం తాళ్లూరు పోలీసులు తిరుగుతున్నారు. అతనిపై షీటు ఉన్న తాలూకా పోలీసులు కానీ, దొంగతనం చేసి సొత్తు దొరికింది అనీ తెలిసిన సీసీఎస్ పోలీసులు కాని అతని కోసం కన్నెత్తి చూడకపోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులలో నిందితుడిగా ఉన్న మధు కదలికలపై ఒంగోలు పోలీసులు దృష్టి సారించకపోగా ఇన్‌ఫార్మర్ అనే నెపంతో వదిలేసి తిరుగుతున్నారు. అదేఅదునుగా రెండు నెలల్లో సుమారు 15 దొంగతనాలు చేసినట్లు తెలిసింది. తాళ్లూరు పోలీసులు గాలిస్తుండగా మధు దొరికినట్లు సమాచారం. అనేక కేసులలో మధు నిందితుడు కావడంతో పోలీసులు గోప్యంగా విచారిస్తున్నారు.
పాత నేరస్థుల కదలికలపై కొరవడిన నిఘా
పాత నేరస్థులపై నిఘా కొరవడింది.నేరాలకు పాల్పడి జైలు నుంచి వచ్చాక తిరగి మళ్లీ నేరాలు చేయడం పరిపాటిగా మారింది. మధు చిన్నతనం నుంచి దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. అలాంటి నేరచరిత్ర ఉన్న వ్యక్తిని ఇన్‌ఫార్మర్ అని నమ్మి వదిలేయడంతో సుమారు 15 నుంచి 20 చోరీలు చేశాడు. అదేవిధంగా మార్కాపురం చెందని ఓ నేరస్థుడు ఒంగోలులోని దిబ్బలరోడ్డులో ఏటీఎం చోరీకి విఫలయత్నం చేసినట్లు పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఇలా పాతనేరస్థులపై నిఘా కొరవడంతో అనేక దొంగతనాలు జరుగుతున్నాయి.