లక్షన్నరకు బీఈడీ సర్టిఫికెట్
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:40 AM
ప్రైవేట్ బీఈడీ కళాశాలలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఎలాంటి బోధన లేకుండానే విద్యార్థులు నేరుగా పరీక్షలకు హాజరవుతున్నారు. కళాశాలల యాజమాన్యాల వద్ద ముడుపులు తీసుకొని యూనివర్సిటీ అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.
దర్శిలో వ్యాపార కేంద్రాలుగా ప్రైవేటు బీఈడీ కళాశాలలు
బోధన లేకుండానే పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు
వైస్ చాన్స్‌లర్‌కు టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ లక్ష్మి ఫిర్యాదు
దర్శి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ప్రైవేట్ బీఈడీ కళాశాలలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఎలాంటి బోధన లేకుండానే విద్యార్థులు నేరుగా పరీక్షలకు హాజరవుతున్నారు. కళాశాలల యాజమాన్యాల వద్ద ముడుపులు తీసుకొని యూనివర్సిటీ అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ తంతు సూట్ కేస్ కంపెనీలను మరిపిస్తుందనడంలో సందేహం లేదు. అక్రమార్కులపై ఫిర్యాదులు చేసినా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ మరింత భ్రష్టుపట్టిపోయింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తీరు మారలేదు. దర్శి పట్టణంలో 17 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఒక్కో కళాశాలకు ఏటా 110 మంది విద్యార్థులను చేర్చుతారు. వీరందరూ ఇతర రాష్ర్టాలకు చెందిన వారే. కొంతమంది దళారులుగా ఏర్పడి ఈ కళాశాలల్లో అడ్మిషన్లు చేయించడం వ్యాపారంగా మారింది. ఇలా అక్రమార్కులు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు.
పిక్నిక్‌కు వచ్చినట్లుగా పరీక్షలకు...
విద్యార్థులు ఏడాదిలో ఒక్కరోజు కూడా కళాశాలకు రారు. సెమిస్టర్, సంవత్సరాంతం పరీక్షలకు పిక్నిక్‌కు వచ్చినట్లు వచ్చి రాసి వెళ్తుంటారు. చూచిరాతలకు యూనివర్సిటీ అధికారులు సహకరిస్తుండటంతో ఈ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. అలా వచ్చిన నకిలీ సర్టిఫికెట్లతో విద్యార్థులు ఉపాధ్యాయుల అవతారం ఎత్తుతున్నారు. భావి భారత పౌరులైన చిన్నారులకు విద్య నేర్పించే గురువులు ఒక్కపూట కూడా కళాశాలలకు వెళ్లకుండా ఉపాధ్యాయులుగా మారుతున్న తీరు చూసి ప్రజలు ముక్కుమీద వేలేసుకుంటున్నారు.
యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
ఇటీవల బీఈడీ కళాశాలల బోగస్ వ్యవహారంపై దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బోధన లేకుండా విద్యార్థులను పరీక్షలకు ఎలా అనుమతిస్తున్నారని ఆమె ప్రశ్నించినట్లు తెలిసింది. భవనాలు లేకుండా కళాశాలలు నిర్వహిస్తున్నారని, వీటికి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఎన్నో ఏళ్ల నుంచి సాగుతుందని, తాను ఏమీ చేయలేనని ఆయన నిస్సహాయత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకే్‌షకు, ఉన్నత విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నిర్ణయించుకున్నట్లు సమాచారం.