సీజనల్ వ్యాధులపె అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Sep 11 , 2025 | 10:11 PM
వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో సీజనల్ వ్యాధులు సోకుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో సీజనల్ వ్యాధులు సోకుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ప్రాథమిక దశలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. స్థానిక దర్శి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం ఆమె అకస్మికంగా పరిశీలించారు. ఓపీ కౌంటర్‌లో రిజిస్టర్ తనిఖీ చేశారు. రోజుకు ఎన్ని ఓపీలు వస్తున్నాయనే విషయాన్ని రిజిస్టర్ పరిశీలించి తెలుసుకున్నారు. అక్కడ అందుతున్న వైద్యం తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నందున ప్రజలు బయపడాల్సిన అవసరం లేదన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావు, సీఐ వై.రామారావు, మున్సిపాలిటీ చైర్మెన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎమ్‌సీ చైర్మెన్ దారం నాగవేణి, సుబ్బారావు, వైద్యాధికారులు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
ముండ్లమూరు : మండలంలోని పూరిమెట్ల గ్రామంలో గత కొన్ని రోజుల నుంచి విష జ్వరాలు, గున్యాతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గురువారం ఆమె పూరిమెట్ల గ్రామాన్ని సందర్శించి రోగులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జ్వర పీడితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇవి సీజనల్ వ్యాధులని వివరించారు. అనంతరం వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లతో మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్ళి పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలో ప్రధాన వీధిలో మురుగు కాలువను చూసి పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రెయినేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వల్లే వ్యాధులు వచ్చాయన్నారు. వెంటనే వీధులన్నీ శుభ్రం చేసి మురుగును తొలగించాలన్నారు. బ్లీచింగ్, ఎబేట్, దోమల నివారణ మందు ఫాగింగ్ చేయాలని కార్యదర్శికి సూచించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, దర్శి మార్కెట్ యార్డు వైస్‌చైర్మన్ కోడెగ మస్తాన్‌రావు, ఎంపీటీసీ చింతలపల్లి వెంకటేశ్వరరావు, చొప్పరపు నాగేశ్వరరావు, రమణాల ఏడుకొండలు, నిడిగంటి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
రైతులను ఆదుకోవాలి
మండలంలోని మోదేపల్లి మేజరులో చివరి భూముల రైతులను ఆదుకోవాలని డాక్టర్ లక్ష్మి పేర్కొన్నారు. ఉమా మహేశ్వర అగ్రహారం వద్ద కాలువను పరిశీలించారు. పూర్తిగా నీరు నిలిచి పోవటంతో వెంటనే జలవనరుల శాఖ ఎస్‌ఈ వరలక్ష్మితో ఫోన్‌లో మాట్లాడారు. ఆయకట్టు పరిధిలో వరి నారు మడులు, మొక్కజొన్న, కంది, పత్తి, మిరప పైర్లు సాగు చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీరు పూర్తిగా నిలుపుదల చేయటం వల్ల రైతులు ఇబ్బందులు పడతారన్నారు. పమిడిపాడు బ్రాంచ్‌కి 750 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా ప్రస్తుతం 350 నుంచి 400 క్యూసెక్కులు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారన్నారు. అవి ఎగువ ప్రాంత మైన పల్నాడు జిల్లా నూజెండ్ల మండల రైతులకే సరి పోతుందన్నారు. ఆరు వందల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తేనే మండలంలోని చివరి భూములు సైతం నీరు చేరుతుందన్నారు. ఆమె వెంట టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, డీసీ చైర్మన్ కంచుమాటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.