బాబోయ్.. పులి
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:52 PM
నల్లమల అటవీ సమీప గ్రామాల్లో పెద్దపులి పంజా దెబ్బకు రెండు నెలల వ్యవధిలోనే 10కిపైగా పశువులు మృత్యువాత పడ్డాయి. ముఖ్యంగా అర్థవీడు మండలంలో రాత్రి వేళల్లో పులి సంచరిస్తూ మేతకు వెళ్లిన పశువులను, ఆవులను, ఎద్దులను చంపేస్తున్నది. తాజాగా గురువారం సాయంత్రం దొనకొండ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఆవుపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆవు తప్పించుకుని వచ్చి గ్రామసమీపంలో పడిపోయింది. శుక్రవారం ఉదయం ఆవును గుర్తించి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు.
మేతకు వెళ్లిన పశువులపై దాడి
భయాందోళనలో పోషకులు
కంభం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): నల్లమల అటవీ సమీప గ్రామాల్లో పెద్దపులి పంజా దెబ్బకు రెండు నెలల వ్యవధిలోనే 10కిపైగా పశువులు మృత్యువాత పడ్డాయి. ముఖ్యంగా అర్థవీడు మండలంలో రాత్రి వేళల్లో పులి సంచరిస్తూ మేతకు వెళ్లిన పశువులను, ఆవులను, ఎద్దులను చంపేస్తున్నది. తాజాగా గురువారం సాయంత్రం దొనకొండ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఆవుపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆవు తప్పించుకుని వచ్చి గ్రామసమీపంలో పడిపోయింది. శుక్రవారం ఉదయం ఆవును గుర్తించి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. గడిచిన రెండు నెలల కాలంలో నల్లమల అటవీ సమీప గ్రామాల్లో 6 ఎద్దులు, 4 ఆవులను పెద్దపులి చంపేసింది. అర్థవీడు మండలంలోని బొల్లుపల్లి, పాపినేనిపల్లి, కొత్తూరు, వీరభద్రాపురం, దొనకొండ, వెలగలపాయ లోయల్లో, యర్రగొండపాలెం, తుమ్మలబయలు తదితర గ్రామాల్లో పెద్దపులి దాడి చేసి 10 పశువులను చంపేసింది. వీటన్నింటిని ఒకటి లేదా రెండు పెద్దపులులు చంపి ఉంటాయని భావిస్తున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులను వివరణ కోరగా పెద్దపులులు ఆహారం కోసం రోజుకు 50 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తాయని, వీటన్నింటిని ఒకే పెద్దపులి దాడి చేసి చంపి ఉంటుందని చెప్పలేమన్నారు. దాడి చేసిన ప్రాంతంలో పాదముద్రలు సేకరించి వాటిని పరిశీలించి ఒకే పులేనా, లేదా రెండు పులులా అని చెప్పగలమన్నారు. ఏడాది కాలంగా ఈ ప్రాంతాలలో సంచరిస్తున్న పులుల విషయంలో గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని, చీకటి పడగానే ఇళ్లకు చేరుకోవాలని సూచించారు.