Share News

నకిలీ బంగారంతో టోకరా

ABN , Publish Date - Nov 27 , 2025 | 11:02 PM

తమ వద్ద ఉన్న బంగారం తాకట్టుపెట్టుకొని నగదు కావాలని వచ్చిన ఇద్దరు వ్యక్తులు జ్యూయలరీ షాపు యజమానిని నకిలీ బంగారంతో బురిడీ కొట్టించిన సంఘటన త్రిపురాంతకంలో జరిగింది.

నకిలీ బంగారంతో టోకరా
సీసీ ఫుటేజీలో ఉన్న మోసగాళ్లు

తాకట్టు పేరుతో రూ.1.50 లక్షలు స్వాహా

కేటుగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన వ్యాపారి

పోలీసులకు ఫిర్యాదు

త్రిపురాంతకం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): తమ వద్ద ఉన్న బంగారం తాకట్టుపెట్టుకొని నగదు కావాలని వచ్చిన ఇద్దరు వ్యక్తులు జ్యూయలరీ షాపు యజమానిని నకిలీ బంగారంతో బురిడీ కొట్టించిన సంఘటన త్రిపురాంతకంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు రెండు రోజుల క్రితం త్రిపురాంతకంలోని వాసవీ జ్యూయలరీ షాపు వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారి వద్ద 28 గ్రాముల బంగారం ఉందని అవసరం నిమిత్తం దానికి కొంత నగదు కావాలని కోరారు. దీంతో షాపు యజమాని ఆ వస్తువులను తీసుకుని వాటికి లక్షా 50 వేల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుని వారికి నగదు అందజేశాడు. నగదు తీసుకున్న తరువాత వారు వెళ్లిపోగా తీసుకున్న వస్తువులు పరిశీలించిన వ్యాపారి అవి నకిలీ బంగారు వస్తువులని గుర్తించి మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్నాడు. వచ్చిన వ్యక్తులు చెప్పిన చిరునామా మేరకు అక్కడ వ్యక్తులను విచారించగా వారు అసలు ఈ ప్రాంతం వారు కాదని తేలిపోయింది. దీంతో బాధిత వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. అయితే నకిలీ బంగారంతో వ్యాపారిని మోసగించి డబ్బుతో వెళ్లిపోయిన కేటుగాళ్లు ఇచ్చిన ఫోన్‌ నెంబరు పరిశీలించగా అది ఏదో కంపెనీ పేరుతో రిజిస్టర్‌ అయి ఉందని, వాళ్లు ఇచ్చిన ఏ ఆధారం సరిగా లేదని కేవలం సీసీ పుటేజీలో కనిపిస్తున్న వ్యక్తుల గుర్తింపు ఆధారంగా విచారణ జరుగుతుందని ఎస్సై శివబసవరాజు తెలిపారు. అయితే ఇదే కేటుగాళ్లు దొనకొండలోని ఒక షాపులో కూడా ఇలాగే మోసం చేసి వెళ్లారని సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ అక్కడ సంఘటన జరిగినట్టు ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెబుతున్నారు.

Updated Date - Nov 27 , 2025 | 11:02 PM