Share News

అభివృద్ధికి అడ్డంకులు

ABN , Publish Date - May 13 , 2025 | 11:36 PM

శింగరకొండ పుణ్యక్షేత్రంలో ఒకవైపు అభివృద్ధి పరుగులు పెడుతుంటే.. మరోవైపు ఆక్రమణలు కూడా అదే స్థాయిలో వెలుస్తున్నాయి. ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో ప్రభుత్వంతోపాటు దాతల సహకారంతో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో కొందరు రాజకీయ అండదండలతో దేవస్థానం భూమిని కబ్జా చేస్తుండడం గమనార్హం.

అభివృద్ధికి అడ్డంకులు
టీటీడీ కల్యాణ మండపం నుంచి వచ్చే దారికి అడ్డుగా నిర్మాణం చేసేందుకు తోలిన ఇసుక

మూడు దశాబ్దాల క్రితం రెవెన్యూ శాఖకు నగదు చెల్లించి 8.54 ఎకరాలు కొనుగోలు చేసిన ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం అధికారులు

రెవెన్యూ అధికారుల ఇళ్ల స్థలాల పట్టాలంటూ ఇబ్బందులు పెడుతున్న కొందరు

అద్దంకి, మే 13 (ఆంధ్రజ్యోతి) : శింగరకొండ పుణ్యక్షేత్రంలో ఒకవైపు అభివృద్ధి పరుగులు పెడుతుంటే.. మరోవైపు ఆక్రమణలు కూడా అదే స్థాయిలో వెలుస్తున్నాయి. ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో ప్రభుత్వంతోపాటు దాతల సహకారంతో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో కొందరు రాజకీయ అండదండలతో దేవస్థానం భూమిని కబ్జా చేస్తుండడం గమనార్హం.

అప్పటికప్పుడు కట్టడాలు

శింగరకొండలో ఇప్పటికే పెద్దఎత్తున మహాకుంభాభిషేకం పనులు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో ఆక్రమణదారుల మరింత రెచ్చిపోయి టీటీడీ కల్యాణ మండపం నుంచి రోడ్డుకు వచ్చేందుకు దారి ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఇప్పటికిప్పుడు అడ్డుగా కట్టడాలు కట్టేందుకు సిద్ధం కావటం గమనార్హం. రెవెన్యూ అధికారులు గతంలో కొంతమందికి నివేశన స్థలాల పట్టాలు ఇవ్వటంతో వాటిని చూపించి అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారు.


రికార్డుల్లో దేవదాయ శాఖ భూమిగా ఉన్నా సరే..

శింగరకొండ దేవస్థానం అధికారులు 1995లో సుమారు 8.55 ఎకరాలను రెవెన్యూ శాఖ నుంచి కొనుగోలు చేశారు. అనంతరం పలుసార్లు సర్వే చేసి హద్దులు కూడా తేల్చారు. దేవదాయశాఖ భూమిగా రెవెన్యూ అధికారులు నిర్ధారించినా కొంత మంది నివాస గృహాల, ఖాళీ స్థలాల యజమానులు మాత్రం దేవదాయశాఖ అధికారుల పనులను అడ్డుకుంటున్నారు.

రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి దేవాలయ అభివృద్ధి పనులు, మహాకుంభాభిషేకం పనులకు అడ్డంగా ఉన్న నివాసాలు, స్థలాలను ఖాళీ చేయించాలని భక్తులు కోరుతున్నారు. వారిలో నిజంగా అర్హులుగా ఉంటే వేరే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కూడా సూచిస్తున్నారు. ఈ విషయమై దేవాలయ అధికారులు కూడా మీనమేషాలు లెక్కిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై ఈవో తిమ్మానాయుడును వివరణ కోరగా రెవెన్యూ, పోలీస్‌ అధికారుల సహాయంతో ఆక్రమణలు తొలగిస్తామని తెలిపారు.

Updated Date - May 13 , 2025 | 11:36 PM