అరటి రైతు విలవిల
ABN , Publish Date - Nov 05 , 2025 | 01:06 AM
మొంథా తుఫాన్ అరటి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. కంభం, అర్ధవీడు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు గుండ్లకమ్మ, జంపలేరు వాగులు 50సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వారంరోజుల నుంచి కంభంలో సుమారు 200ఎకరాలకు పైగా అరటి తోటలు వరద నీటిలో ఉన్నాయి.
ఇంకా నీటిలోనే 200 ఎకరాల్లో తోటలు
గెలలు పండి చెట్లతో సహా కుళ్లిపోతున్న వైనం
గుండ్లకమ్మ బ్రిడ్జిపై తగ్గని ప్రవాహం
రైతులు పొలాలకు వెళ్లలేని పరిస్థితి
కంభం మండలంలో రూ.కోటికిపైగా నష్టం
కంభం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : మొంథా తుఫాన్ అరటి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. కంభం, అర్ధవీడు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు గుండ్లకమ్మ, జంపలేరు వాగులు 50సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వారంరోజుల నుంచి కంభంలో సుమారు 200ఎకరాలకు పైగా అరటి తోటలు వరద నీటిలో ఉన్నాయి. అక్కడికి వెళ్లి చెట్లకు కాసిన వందలాది అరటి గెలలు కోసేందుకు వీలు లేకపోవడంతో చెట్లపైనే మగ్గి రాలిపోతున్నాయి. దీంతో రైతులు కన్నీరుపెడు తున్నారు. తుఫాన్ ప్రభావం తగ్గి వారమవుతున్నప్పటికీ గుండ్లకమ్మ ఉధృతంగానే ప్రవహిస్తుండడంతో పొలాలకు వెళ్లేందుకు ఉన్న కల్వర్టు దాటలేకపోతున్నామని వాపోతున్నారు. వరద నీటిలో ఉన్న 200ఎకరాల అరటితోటలో కాచిన గెలలను కోయడానికి వీలులేక పనికిరాకుండా పోవడంతో సుమారు కోటి రూపాయలకు పైగా పంట నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. అరటి తోటలను ముంచేంత వరదను మునుపెన్నడూ చూడలేదన్నారు. వాగు ఉధృతి తగ్గాలంటే మరో నాలుగు రోజులు పడుతుందని అప్పటికి చెట్లతో సహా కుళ్లి కాయలు రాలిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఉద్యానవన శాఖ అధికారి శ్వేత వివరణిస్తూ.. కంభం, చింతలపాలెం, గూడెం ప్రాంతాలలో వరదలో మునిగిన అరటి తోటలను పరిశీలించామని తెలిపారు. నష్టం వివరాలను నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపించామని చెప్పారు.