శ్మశాన భూమి కబ్జాకు యత్నం
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:43 AM
తర్లుపాడులోని హిందూ శ్మశాన భూమిని కబ్జా చేసేందుకు ఓ వ్యాపార వేత్త ప్రయత్నిస్తున్నారు. తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే రహదారిలో సర్వే నెంబర్ 82/1లో 1.76 సెంట్ల బండి పోరంబోకు, రహదారి భూమిగా ఉంది. దాన్ని తర్లుపాడులోని నాయుడుపల్లె కాలనీకి చెందిన హిందువులు శ్మశానంగా ఉపయోగించుకుంటున్నారు.
నాలుగు రోజులుగా చదును
సమాధులు సైతం తొలగింపు
దాని విలువ రూ.3 కోట్లపైనే..
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
తర్లుపాడు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : తర్లుపాడులోని హిందూ శ్మశాన భూమిని కబ్జా చేసేందుకు ఓ వ్యాపార వేత్త ప్రయత్నిస్తున్నారు. తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే రహదారిలో సర్వే నెంబర్ 82/1లో 1.76 సెంట్ల బండి పోరంబోకు, రహదారి భూమిగా ఉంది. దాన్ని తర్లుపాడులోని నాయుడుపల్లె కాలనీకి చెందిన హిందువులు శ్మశానంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ భూమిని మార్కాపురం పట్టణానికి చెందిన వ్యాపారవేత్త ఒకరు నాలుగురోజులుగా ఎక్స్‌కవేటర్‌తో చదును చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సమాధులను కూడా తొలగించారు. పక్కనే ఉన్న తన భూమిలో ప్లాట్లు వేసేందుకే బరి తెగించి శ్మశానాన్ని కబ్జా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కాపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించడంతో ఆ వ్యాపార వేత్త శ్మశానంపై కన్నేశారు. ఈ భూమి విలువ ప్రస్తుతం ఎకరం రూ.2కోట్ల మేర పలుకుతోంది. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కన్నెర్ర చేస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమించుకున్న శ్మశాన భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.