అట్టహాసంగా పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:46 PM
ఒంగోలు నగరంలోని డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో సోమవారం 28వ అంతర్ పాలిటెక్నిక్ బాలుర స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది.
350 మంది క్రీడాకారులు హాజరు
క్రీడా పతాకాన్ని ఆవిష్కరించిన ఒంగోలు మునిసిపల్ కమిషనర్
ఒంగోలు విద్య డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరంలోని డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో సోమవారం 28వ అంతర్ పాలిటెక్నిక్ బాలుర స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న 350 మంది క్రీడాకారులు స్పోర్ట్స్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ అందరనీ అలరించింది. ప్రారంభ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ డాక్టర్ కే వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని క్రీడాకారుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అంతకు ముందు కమిషనర్ క్రీడాపతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ పతాకాన్ని పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఎన్.శ్రీనివాసరావు, కళాశాల పతాకాన్ని ఫిజికల్ డైరెక్టర్ కే ఆంజనేయులు ఆవిష్కరించారు. క్రీడాజ్యోతిని ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు వెలిగించగా క్రీడాకారులు క్రీడాజ్యోతిని గ్రౌండ్‌లో తిరిగి ప్రదర్శించారు. ఈ స్పోర్ట్ట్‌మీట్‌లో క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని ప్రిన్సిపాల్ కోరారు. అనంతరం స్పోర్ట్స్ మీట్ ప్రారంభ సూచికగా పావురాలను ఎగురవేశారు.
స్పోర్ట్స్ మీట్‌కు భారీ ఏర్పాట్లు
స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు కళాశాలలో భారీ ఏర్పాట్లు చేశారు. వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ కోర్టులతో పాటు రన్నింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. దూరప్రాంతాలైన గిద్దలూరు, కంభం, మార్కాపురం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు కళాశాలలోనే భోజన వసతి ఏర్పాటు చేశారు. సుమారు 350 మందికి కళాశాల ప్రధాన భవనంలోనే వసతి కల్పించినట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థుల కేరింతల మధ్య ఆటలు ప్రారంభించి రన్నింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. క్రీడాకారులకు వైద్య సేవలు అందించేందుకు క్రీడామైదానం వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు.