అర్హులకు భరోసా
ABN , Publish Date - Aug 31 , 2025 | 02:43 AM
ఎన్టీఆర్ భరోసా పథకం కింద నెలవారీ పింఛన్లు పొందుతున్న వారిలో నెలకొన్న ఆందోళనకు కూటమి ప్రభుత్వం తెరదించింది. అర్హులకు ఒక్కనెల కూడా లబ్ధిని ఆపబోమంటూ స్పష్టం చేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీన ఇచ్చే పింఛన్లు అర్హులందరికీ అందుతాయని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
నోటీసు ఇచ్చినా అప్పీలు చేసుకున్న వారికి పింఛన్ అందజేయనున్న ప్రభుత్వం
జిల్లాలో 2,84,625 మంది లబ్ధిదారులు.. రూ.124.52 కోట్లు విడుదల
రేపు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేయనున్న సచివాలయ సిబ్బంది
ఒంగోలు నగరం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా పథకం కింద నెలవారీ పింఛన్లు పొందుతున్న వారిలో నెలకొన్న ఆందోళనకు కూటమి ప్రభుత్వం తెరదించింది. అర్హులకు ఒక్కనెల కూడా లబ్ధిని ఆపబోమంటూ స్పష్టం చేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీన ఇచ్చే పింఛన్లు అర్హులందరికీ అందుతాయని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. సచివాలయాల ద్వారా నోటీసులు అందుకున్న వారికి సెప్టెంబర్‌లో పంపిణీ చేసే పింఛన్ నిలిపివేస్తారంటూ ప్రచారం జరగటంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే పింఛన్ పొందుతున్న వారిలో అనర్హులు, బోగస్ పింఛన్‌దారులను ఏరివేసేందుకే ఇలా నోటీసులు ఇచ్చామని ప్రభుత్వం పేర్కొంది. వికలత్వం 40శాతం కంటే తక్కువ ఉన్నవారికి, మంచానికి, వీల్‌చైర్‌కు పరిమితం అయ్యామంటూ నెలవారీ రూ.15వేలు లబ్ధి పొందుతున్న పూర్తి ఆరోగ్యవంతులకు మాత్రమే ప్రభుత్వం సచివాలయాల ద్వారా నోటీసులు జారీచేసింది. ప్రస్తుతం దివ్యాంగుల కేటగిరీ కింద రూ.6వేలు పింఛన్ పొందుతూ 40శాతం కంటే వైకల్యం తక్కువగా ఉండి వారు ఇతర కేటగిరీల కింద అంటే 60ఏళ్ల వయస్సు దాటి, లేదా వితంతువు అయితే, లేదా ఒంటరి మహిళగా ఉంటే వారి పింఛన్‌ను మార్పు చేశారు. అదే హెల్త్ పింఛన్ తీసుకుంటున్న వారిలో కూడా అనర్హులు ఉంటే వారు కూడా ఇతర కేటగిరీ కింద పింఛన్‌కు అర్హత ఉంటే మార్పు చేసి ఈ నెలలో అందజేయనున్నారు.
2,801 మందికి నోటీసులు
మొత్తం మీద 2,801 మందికి పూర్తిగా పింఛన్ రద్దు కోసం నోటీసులు జారీచేశారు. వారిలో తాము పింఛన్ పొందేందుకు అర్హులమంటూ సంబంధిత ఎంపీడీవోకి, మున్సిపల్ కమిషనర్‌కు అప్పీలు చేసుకున్న వారికి మాత్రం సెప్టెంబర్ మాసంలో ఎలాంటి ఢోకా లేకుండా పింఛన్ పంపిణీ చేస్తారు. తాము అర్హులంటూ అధికారులకు అప్పీలు చేయకుండా ముఖంచాటేసిన వారికి మాత్రమే నిలుపుదల చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో జిల్లాలో అర్హులైన వారికి పింఛన్ భరోసా ఇచ్చినట్లైంది. జిల్లాలో దాదాపు 2,801 సచివాలయాల ద్వారా నోటీసులు జారీ అయ్యాయి. వీరిలో సగానికి సగం మంది తాము అర్హులమంటూ అధికారులకు అప్పీలు చేసుకున్నారు. ఈ నెల 30వతేదీ వరకు అప్పీలు చేసుకున్న వారికి ప్రభుత్వం సోమవారం పింఛన్‌ను పంపిణీ చేయనుంది. ఎటొచ్చి నోటీసులు అందుకున్నా తమ అర్హతను నిరూపించుకోని అనర్హులకు మాత్రమే ప్రభుత్వం పింఛన్‌ను నిలిపివేయనుంది.
రూ.124.52 కోట్లు విడుదల..
జిల్లాలో సెప్టెంబర్‌లో 2,84,625 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ పంపిణీ చేయనుంది. వీరికి పింఛన్ సొమ్ము అందించేందుకు రాష్ట్రప్రభుత్వం జిల్లాకు రూ.124,52,22500లను విడుదల చేసింది. ఈనెల 31న ఆదివారం బ్యాంకులకు సెలవు కావటంతో శనివారం నాడే సచివాలయం సిబ్బంది పింఛన్ సొమ్మును బ్యాంకుల నుంచి డ్రా చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచే పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పింఛన్‌దారులకు ఎ లాంటి ఇబ్బందిలేకుండా ఇంటికే వెళ్లి తలుపుతట్టి మరీ పింఛన్ పంపిణీ చేయనున్నారు. శనివారం నాడే సచివాలయం సిబ్బంది దూరప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సోమవారం పింఛన్ సొమ్ము తీసుకునేందుకు అందుబాటులో ఉండాలని సమాచారం అందించారు. రాష్ట్రప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద కేవలం అనర్హులను, బోగస్ లబ్ధిదారులను ఏరివేసే దిశగా చేపడుతున్న చర్యల్లో అర్హులకు ఏ ఒక్కరికి అ న్యాయం జరగకుండా పగడ్బందీ చర్యలు చేపడుతోంది.