Share News

అభివృద్ధి పనులకు ఆమోదం

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:16 AM

ఒంగోలు నగరపాలక సంస్థ పాలవకర్గ సమావేశం సోమవారం సాదాసీదాగా సాగింది. నగర అభివృద్ధిలో భాగంగా 75 అంశాలను అజెండాలో పొందుపరచగా, దాదాపుగా అన్నింటికీ సభ్యులు ఆమోదం పలికారు. గత నెల 28న జరగాల్సిన కౌన్సిల్‌ సమావేశం మొంథా తుఫాన్‌ కారణంగా ఈనెల 3వ తేదీకి వాయిదా పడింది. అయితే సోమవారం మధ్యాహ్నం నుంచి జరిగిన ఈ సమాశానికి మేయర్‌ గంగాడ సుజాత అధ్యక్షత వహించగా, టీడీపీ, జనసేన, వైసీపీ సభ్యులు హాజరయ్యారు.

అభివృద్ధి పనులకు ఆమోదం
కార్పొరేషన్‌ సమావేశానికి హాజరైన కార్పొరేటర్లు (ఇన్‌సెట్లో) మాట్లాడుతున్న మేయర్‌ సుజాత

80 అడుగులకు ట్రంక్‌ రోడ్‌ విస్తరణ

ఒంగోలు కార్పొరేషన్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరపాలక సంస్థ పాలవకర్గ సమావేశం సోమవారం సాదాసీదాగా సాగింది. నగర అభివృద్ధిలో భాగంగా 75 అంశాలను అజెండాలో పొందుపరచగా, దాదాపుగా అన్నింటికీ సభ్యులు ఆమోదం పలికారు. గత నెల 28న జరగాల్సిన కౌన్సిల్‌ సమావేశం మొంథా తుఫాన్‌ కారణంగా ఈనెల 3వ తేదీకి వాయిదా పడింది. అయితే సోమవారం మధ్యాహ్నం నుంచి జరిగిన ఈ సమాశానికి మేయర్‌ గంగాడ సుజాత అధ్యక్షత వహించగా, టీడీపీ, జనసేన, వైసీపీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చ జరగ్గా, కొన్ని అంశాలపై వైసీపీ కార్పొరేటర్లు అనవసర రాద్ధాంతం చేశారు. కాగా అజెండా అంశాలలో కీలకమైన ట్రంక్‌ రోడ్‌ విస్తరణకు ఎట్టకేలకు ఆమోదం పడింది. తొలుత 100 అడుగులు విస్తరించాలని భావించగా, అటు వ్యాపారుల నుంచి వచ్చిన విన్నపాలపై 80 అడుగులకు ఒకే చేశారు. అలాగే రెండోదశలో మస్తాన్‌ దర్గా నుంచి కొత్తపట్నం బస్టాండ్‌ వరకు 80 అడుగుల రోడ్‌ను విస్తరించేందుకు ఆమోదం లభించింది. అలాగే శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేసేందుకు గడువు ముగియగా, మరో మూడు నెలలు పొడిగించారు. టీడీపీ కార్పొరేటర్‌ దాచర్ల వెంకటరమణయ్య మాట్లాడుతూ మొంథా తుఫాన్‌ ప్రభావం వలన జరగబోయే భారీ నష్టాలను ముందుగా గుర్తించి నష్టాన్ని తగ్గించడంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఆధ్వర్యంలో ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. అలాగే కార్పొరేషన్‌కు అవార్డు లభించడం అభినందనీయం అన్నారు. అభివృద్ధి కోసం పొందుపరిచిన అజెండా అంశాలపై జరిగిన చర్చలో వైసీపీ, జనసేన కార్పొరేటర్లు అభ్యంతరం తెలియజేస్తూ మాట్లాడగా వెంకటరమణ్య తనదైని శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. డిప్యూటీ మేయర్‌ వేమూరి వెంకట సూర్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ నేతృత్వంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు ఇప్పటికే చేపట్టిన రూ. 119 కోట్లు పనులు త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈదర వెంకట సురేష్‌ బాబు మాట్లాడుతూ ప్రగతి భవన్‌ నుంచి, స్టేడియం వైపు వాటర్‌ సమస్య ఉందని, అక్కడ కల్వర్టు నిర్మిస్తే తూర్పు వైపు ప్రవహిస్తాయని, ఆదిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో కమిషనరు కే. వెంకటేశ్వరరావు, ఎంఈ ఐశయ్య, ఏసీపీ ప్రసాద్‌తోపాటు ఇతర అధికారులు, టీడీపీ, జనసేన, వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

నగర సుందరీకరణకు ప్రాధాన్యం

నగర సుందరీకరణలో భాగంగా నగర ప్రధాన కూడలిలను అందంగా తీర్చి దిద్దేందుకు మంగమ్మ కాలేజి జంక్షన్‌ వద్ద 30 అడుగుల సర్కిల్‌తో చేపట్టిన ఐ లాండ్‌ అభివృద్ధికి ఆమోదం తెలిపారు. అలాగే రామనగర్‌ 6వ లైను నుంచి 10వ లైను వరకు గ్రీన్‌ బెల్ట్‌ అభివృద్ధికి, వాటితోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్‌లు, డ్రైన్‌లు, కల్వర్టులు ఇతరత్రా అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది.

పారిశుధ్య కార్మికులకు సన్మానం

మొంథా తుఫాన్‌ కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా సమర్థవంతంగా పనిచేసిన పారిశుధ్య విభాగం అధికారులు, సిబ్బందిని కౌన్సిల్‌ సభ్యులు ఘనంగా సన్మానించారు. తుఫాన్‌ కారణంగా రేయింబవళ్లు కష్టపడి పనిచేయడంతోపాటు కార్పొరేషన్‌కు సైక్లోన్‌ మొంథా ఫైటర్స్‌ అవార్డు సాధనకు కృషి చేసినందుకు శాలువాలు కప్పి సన్మానించారు.

Updated Date - Nov 04 , 2025 | 12:23 AM