కొత్త రైస్ కార్డులకు దరఖాస్తులు
ABN , Publish Date - May 08 , 2025 | 01:48 AM
రేషన్ కార్డుల (రైస్ కార్డు) కోసం ఎదురుచూస్తున్న పేదలకు కొత్తవి ఇచ్చేందుకు బుధవారం నుంచి సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏడాది న్నర నుంచి కొత్త కార్డులతోపాటు ప్రస్తుతం ఉన్న వాటిలో చేర్పులు, మార్పుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా మొదలైన స్వీకరణ
చేర్పులు, మార్పులు, సవరణలు కూడా
సంజీవరావుపేటలో ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
ఒంగోలు కలెక్టరేట్, మే 7(ఆంధ్రజ్యోతి) : రేషన్ కార్డుల (రైస్ కార్డు) కోసం ఎదురుచూస్తున్న పేదలకు కొత్తవి ఇచ్చేందుకు బుధవారం నుంచి సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏడాది న్నర నుంచి కొత్త కార్డులతోపాటు ప్రస్తుతం ఉన్న వాటిలో చేర్పులు, మార్పుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ కొత్త రేషన్ కార్డుల జారీకి అర్హులైన పేదల నుంచి దరఖాస్తుల స్వీకరణకు నిర్ణయించారు. బుధవారం నుంచి ప్రక్రియ ప్రారంభమైంది. సచివాలయాల్లో రైస్ కార్డులకు సంబంధించి ఏడు రకాల సర్వీసులను ప్రారంభించారు. కొత్త బియ్యం కార్డు, సభ్యుల చేరిక, కార్డును విభజించడం, ఉన్న సభ్యుల తొలగింపు, కార్డును అప్పగించడం, చిరునామా మార్పులు, తప్పు ఆధార్ సీడింగ్‌ను సరిదిద్దడం వంటి సేవలను ప్రారంభించారు. సచివాలయాల్లో సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. కాగా గిద్దలూరు మండలం సంజీవరావుపేట సచివాలయంలో రైస్‌కార్డుల సేవలను అక్కడి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రారంభించారు. అలా జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో రైస్‌కార్డులు, చేర్పులు, మార్పుల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు చర్యలు తీసుకున్నారు. అర్హత ఉండి రైస్‌కార్డు లేని పేదలందరూ దరఖాస్తులు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల్‌కృష్ణ ఒక ప్రకటనలో కోరారు.