ఎనీటైం కార్డు
ABN , Publish Date - May 29 , 2025 | 01:46 AM
కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూసిన అర్హులైన పేదలకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఇప్పటికే సచివాలయాల్లో దరఖాస్తుకు అవకాశం వచ్చింది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
రేషన్ దరఖాస్తులకు ఎలాంటి గడువు లేదు
ఎప్పుడైనా చేసుకొనే అవకాశం
ధ్రువీకరణ పత్రాల పేరుతో తిరస్కరణకు చెల్లుచీటీ
త్వరలో క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డులు
చేర్పుల కోసం భారీగా దరఖాస్తులు
కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూసిన అర్హులైన పేదలకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఇప్పటికే సచివాలయాల్లో దరఖాస్తుకు అవకాశం వచ్చింది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైస్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో రైస్ కార్డును అందించే విఽధంగా చర్యలు తీసుకుంది. కార్డుల్లో చేర్పులు, మార్పులకూ అవకాశం ఇచ్చింది.
ఒంగోలు కలెక్టరేట్, మే 28 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఒకటిన్నర సంవత్సరం తర్వాత ప్రభుత్వం రైస్ (రేషన్) కార్డులు ఇచ్చేందుకు అవకాశం కల్పించింది. ప్రారంభంలో దరఖా స్తు చేసుకునేందుకు సర్వర్ సరిగా పనిచేయని కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు సచివాలయ సిబ్బంది కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేం దుకు కొన్నిరకాల ధ్రువీకరణ పత్రాలు కావాలని గట్టిగా చెప్పడంతో లబ్ధిదారుల్లో ఆందో ళన నెలకొంది. అయితే నూతన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఆధార్ కార్డు కలిగి ఉంటే చాలు రైస్‌కార్డుకు దరఖాస్తు చేసుకునే విధంగా అవకాశం కల్పించింది. కార్డులో పేర్లు తొలగింపుల కోసం మాత్రం అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంది. పేరు తొలగింపు కోసం వచ్చే దరఖాస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా రేషన్ కార్డులో పేరు యాడ్ (నమోదు) చేసుకునే విధంగా చర్యలు తీసుకుంది. రేషన్ కార్డు కోసం దరఖాస్తులకు ఎలాంటి గడువు విధించకుండా ఎప్పుడైనా చేసుకొనే అవకాశం కల్పించింది.
త్వరలో స్మార్ట్ కార్డు
ప్రస్తుతం ఉన్న రైస్ కార్డులో క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్‌కార్డును ఇచ్చేందుకు నూతన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో ఉండే క్యూఆర్ కోడ్ ద్వారా రేషన్ తీసుకునే అవకాశం కల్పించింది. జిల్లావ్యాప్తంగా 1,392 రేషన్ షాపుల పరిధిలో 6,70,571 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటి స్థానంలో లబ్ధిదారులకు ఈ స్మార్ట్‌కార్డులను త్వరలో ఇవ్వనుంది. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంది. ఈ స్మార్ట్‌కార్డు ద్వారా రేషన్ పంపిణీ చేయడం వలన అక్రమాలకు కూడా అడ్డుకట్ట వేయవచ్చన్నది ప్రభుత్వ భావన.
పేరు యాడింగ్ కోసం 34,766 దరఖాస్తులు
ప్రభుత్వం కొత్త రైస్‌కార్డులతోపాటు పేర్ల చేర్పునకు కూడా అవకాశం కల్పించింది. అందుకోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు ఆన్‌లైన్ ద్వారా 47,119 దరఖాస్తులు అందగా అందులో 34,766 యాడింగ్ కోసం వచ్చినవే ఉన్నాయి. కొత్త రైస్‌కార్డుల కోసం 5,690 దరఖాస్తులు వచ్చాయి. అడ్రస్ మార్పు కోసం 1,467, ఆధార్ సీడింగ్ కోసం 605, కార్డులో పేరు తొలగింపు కోసం 827, కార్డును అప్పగించేందుకు 19 దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం ఇంకా అవకాశం కల్పించడంతో దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది.
దరఖాస్తుల స్వీకరణను పరిశీలించిన డీఎస్‌వో
రైస్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన అర్జీదారులను ధ్రువీకరణ పత్రాలు కావాలని సచివాలయ సిబ్బంది వెనక్కు పంపుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో డీఎస్‌వో పద్మశ్రీ సచివాలయాలను సందర్శిస్తున్నారు. ఇటీవల కొత్తపట్నం సచివాలయానికి వెళ్లిన ఆమె.. అక్కడ కంప్యూటర్‌లో నమోదు చేస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుదారులతో మాట్లాడారు. సచివాలయాల్లో రైస్ కార్డుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.