Share News

డీఎస్సీ సర్టిఫికెట్లపై మరో మలుపు

ABN , Publish Date - Sep 12 , 2025 | 02:16 AM

మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన మరో మలుపు తిరిగింది. ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రాల విషయంలో కొత్త చిక్కు వచ్చి పడింది. ప్రధానంగా మహిళా అభ్యర్థులకు సంబంధించి ఈ వివాదం నెలకొంది. ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్ల విషయంలో మొదట పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. మహిళా అభ్యర్థుల విద్యార్హతలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అన్నీ తండ్రి పేరుతోనే ఉంటాయి.

డీఎస్సీ సర్టిఫికెట్లపై మరో మలుపు

పునఃపరిశీలించాలని విద్యాశాఖ నిర్ణయం

35 మంది వివాహితులు తండ్రి పేరుతో ఈడబ్ల్యూఎస్‌ పత్రాలు

భర్త పేరుతో సమర్పించాలని తాజాగా సూచన

ఒంగోలు విద్య, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన మరో మలుపు తిరిగింది. ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రాల విషయంలో కొత్త చిక్కు వచ్చి పడింది. ప్రధానంగా మహిళా అభ్యర్థులకు సంబంధించి ఈ వివాదం నెలకొంది. ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్ల విషయంలో మొదట పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. మహిళా అభ్యర్థుల విద్యార్హతలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అన్నీ తండ్రి పేరుతోనే ఉంటాయి. అందుకే వారు కూడా తండ్రి కుటుంబ ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు సమర్పించారు. దీనిపై కొన్ని జిల్లాల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వివాహితులైన మహిళా అభ్యర్థుల్లోని కొందరి భర్తల్లో సంపన్నకుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. వారికి భారీగా ఆస్తులు, భూములు, డిపాజిట్లు ఉన్నాయి. ఈనేప థ్యంలో మహిళా అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లను పునఃపరిశీలించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డీఈవోలను ఆదేశించింది.

మళ్లీ సర్టిఫికెట్ల కోసం ఉరుకులు.. పరుగులు

ఈసారి డీఎస్సీలో జండర్‌ కాలంలో మహిళలు అయితే వివాహితులా, అవివాహితులా అని స్పష్టంగా అడిగారు. వివాహితులుగా పేర్కొన్న వారికి ఈడబ్ల్యూఎస్‌ కోటాలో పది శాతం రిజర్వేషన్‌ కల్పించారు. దీంతో మహిళా అభ్యర్థులు తమ తండ్రి పేరుతోనే ఆ సర్టిఫికెట్లు సమర్పించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో మరోసారి పరిశీలించి జిల్లాలో ఎంపిక జోన్‌లో నిలిచిన మహిళా అభ్యర్థుల్లో 35 మంది వివాహితులు ఉన్నట్లు గుర్తించారు. వీరంతా తండ్రి పేరుతోనే ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు సమర్పించారు. ఈ 35 మంది మళ్లీ తమ భర్తల పేరుతో తాజాగా ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు కోరారు. ఎంపిక జాబితాలో ఉన్న వీరు ఉరుకులు, పరుగులు మీద మండల రెవెన్యూ అధికారులను సంప్రదించి ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు తెచ్చి సమర్పించారు. గురువారం సాయంత్రానికి 35 మందిలో ఇద్దరి సర్టిఫికెట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం మీద సర్టిఫికెట్ల పరిశీలన రోజుకో మలుపు తిరుగుతుండటంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు.

Updated Date - Sep 12 , 2025 | 02:16 AM