మరో ముందడుగు
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:26 AM
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. అత్యంతకీలకంగా భావిస్తున్న ఫీడర్ కాలువ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అందుకు అవసరమైన రూ.456 కోట్లను మంజూరు చేసింది.
వెలిగొండ ఫీడర్ కాలువ పనులకు రూ.456 కోట్లు మంజూరు
లైనింగ్, కాంక్రీట్ గోడల నిర్మాణం
సీఎం సమీక్ష జరిగిన 20 రోజులకే ఉత్తర్వులు జారీ
గత ఏడాది అక్టోబరు ఆఖరులో ప్రాజెక్టును సందర్శించిన ఇరిగేషన్ మంత్రి నిమ్మల
అనంతరం ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్న పనులు
వచ్చే ఏడాది ఆగస్టుకు తొలి దశ పూర్తి దిశగా చర్యలు
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. అత్యంతకీలకంగా భావిస్తున్న ఫీడర్ కాలువ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అందుకు అవసరమైన రూ.456 కోట్లను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెలిగొండపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి నిధులకు భరోసా ఇచ్చిన 20 రోజులకే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. తద్వారా వచ్చే ఏడాది ఆగస్టు ఆఖరు నాటికి వెలిగొండ తొలిదశ పూర్తిపై సీఎం చెప్తున్న హామీకి అనుగుణంగా చర్యలు కనిపిస్తున్నాయి.
ఒంగోలు, సెప్టెంబరు 26 (ఆంధ్ర జ్యోతి) : వెలిగొండ ప్రాజెక్టు పనులు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. సుమారు 4.43 లక్షల ఎకరాల ఆయక ట్టుకు సాగు నీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించేందుకు ఉద్దేశించి ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.10వేల కోట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు రూ.6వేల కోట్లు ఖర్చు చేశారు. పలు క్లిష్టమైన పనులు గత టీడీపీ ప్రభుత్వ కాలంలోనే పూర్తయ్యాయి. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీరివ్వలేకపోయారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. పలుసార్లు సమీక్షలు నిర్వహించి లోటుపాట్లను గుర్తించారు. జిల్లా నేతల విజ్ఞప్తి, సీఎం ఆదేశాలతో గత ఏడాది అక్టోబరు 29న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, వెలిగొండ ప్రాజెక్టును సందర్శించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఇతర ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో కలిసి పనులను పరిశీలించారు. వివిధ సమస్యలను, పనుల్లో లోటుపాట్లను గుర్తించిన ఆయన సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు.
ఫీడర్ కాలువే కీలకం
కృష్ణానది నుంచి టన్నెల్ ద్వారా దోర్నాల మండలం కొత్తూరు వద్దకు చేరే నీరు అక్కడి నుంచి సుమారు 21.80 కి.మీ మేర ఫీడర్ కాలువ ద్వారా నల్లమల సాగర్ (ప్రాజెక్టు)లోకి చేరుతుంది. గతంలో జలయజ్ఞంలో భాగంగా ఆ కాలువను తవ్వారు. అనేక ఏళ్ల క్రితం తవ్వడం, పనుల్లో నాణ్యత లోపంతో ఫీడర్ కాలువ చాలాచోట్ల దెబ్బతింది. భారీ వర్షాలకు కాలువ కట్టలు తెగిపోయాయి. అనేక చోట్ల మట్టిలో బొరియలు (రంధ్రాలు) పడి నీరు నిలిచే పరిస్థితి లేకపోవడం, ఇతరత్రా లోపాలను మంత్రి నిమ్మల తన పర్యటన సమయంలో గుర్తించారు. కాలువ ఉన్న పరిస్థితి ప్రకారం దాని ద్వారా నీరు ప్రాజెక్టుకు చేరే అవకాశం లేదన్న అభిప్రాయానికి వచ్చారు. అందుకు శాశ్వత పరిష్కారం గురించి సమీక్ష సందర్భంగా అధికారులను మంత్రి కోరారు. మొత్తం కాలువను లైనింగ్ చేయడం, అవసరమైన ప్రాంతాలలో కట్టలకు సిమెంట్ గోడల నిర్మాణం అవసరమని అధికారులు నివేదించారు. దీంతో అక్కడి మట్టి నమూనాలు, ఇతర పరీక్షలు చేయించాలన్న మంత్రి నిమ్మల సూచనలతో హైదరాబాద్ నుంచి నిపుణులను పిలిపించి ఆ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఫీడర్ పనుల కోసం రూ.456 కోట్లు అవసరమని ప్రాజెక్టు అధికారులు నివేదించారు.
ప్రాజెక్టు పూర్తికి 2,059కోట్లు అవసరం
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పూర్తి చేయాలంటే రూ.2,059 కోట్లు అవస రమని అంతిమంగా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. 20 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయిలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఈ నిధుల అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. అనుకున్న విధంగా వచ్చే ఏడాది ఆగస్టుకు తొలిదశ పూర్తి చేయాల్సిందేనని అధికారులను ఆదేశించిన సీఎం.. నిధుల కల్పనకు భరోసా ఇచ్చారు. వాటిలో ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు ప్రతిపాదించిన రూ.456 కోట్లు మినహా మిగతావి ఇప్పటికే చేస్తున్నవి కనుక కొత్తగా టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు. నిధులను పనులు చేసే కొద్దీ.. సహాయ, పునరావాస చర్యల నిధులను నిర్వాసితుల తరలింపు సమయంలో ఇచ్చే అవకాశం ఉంది.
మంత్రి నిమ్మల ప్రత్యేక చొరవ
ఫీడర్ కాలువకు సంబంధించి రూ.456 కోట్లు మంజూరు చేస్తే టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ ఆలస్యమైతే నిర్దేశిత లక్ష్యం లోపు పనులు పూర్తిచేయడం కష్టమని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై సీఎం స్పందించి తక్షణ చరకుఉ సీఎంవో అధికారులను ఆదేశించగా జలవనరులశాఖ మం త్రి నిమ్మల మరింత చొరవ తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఫీడర్ కాలువ లైనింగ్, సిమెంట్ గోడల నిర్మాణానికి రూ.456 కోట్లు మంజూరు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వు లు వెలువడ్డాయి. తద్వారా వచ్చే ఏడాది ఆగస్టుకు తొలిదశ పూర్తివైపు ప్రభుత్వ చర్యలు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.