మరో రూపాయి
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:39 AM
దక్షిణాది పొగాకు మార్కెట్లో గరిష్ఠ ధర మరో రూపాయి పెరిగింది. ఇప్పటి వరకు కిలో రూ.300 ఉండగా శుక్రవారం ఒంగోలు-1 కేంద్రంలో మరో రూపాయి పెరిగి రూ.301 లభించింది. మొత్తం 11 కేంద్రాల్లో ఏడుచోట్ల వేలం ప్రక్రియ కొనసాగింది. గరిష్ఠ ధర కిలోకు ఒంగోలులో రూ.301, పొదిలిలో రూ.292 లభించింది.
ఒంగోలు-1లో పొగాకు గరిష్ఠ ధర కిలో రూ.301
నాలుగు కేంద్రాల్లో ముగిసిన అనుమతించిన పంట కొనుగోళ్లు
ఒంగోలు, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది పొగాకు మార్కెట్లో గరిష్ఠ ధర మరో రూపాయి పెరిగింది. ఇప్పటి వరకు కిలో రూ.300 ఉండగా శుక్రవారం ఒంగోలు-1 కేంద్రంలో మరో రూపాయి పెరిగి రూ.301 లభించింది. మొత్తం 11 కేంద్రాల్లో ఏడుచోట్ల వేలం ప్రక్రియ కొనసాగింది. గరిష్ఠ ధర కిలోకు ఒంగోలులో రూ.301, పొదిలిలో రూ.292 లభించింది. మిగిలిన ఐదుచోట్ల రూ.300 పలికింది. అలాగే పలు కేంద్రాల్లో కనిష్ఠ ధర కిలో రూ.130గా ఉంది. పొదిలిలో రూ.120 పలికింది. అదే సమయంలో నోబిడ్‌లు కూడా ఇంచుమించు 24శాతం మేర ఉన్నాయి. అత్యధికంగా పొదిలిలో 36.02 శాతం నోబిడ్ అయ్యాయి. మొత్తం ఏడు కేంద్రాల్లో శుక్రవారం 5,897 బేళ్లను అమ్మకానికి తీసుకురాగా 3,815 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. 1,578 నోబిడ్ అయ్యాయి. మరికొన్ని బేళ్లు వివిధ రూపాలలో తిరస్కరణకు గురయ్యాయి. ఇదిలాఉండగా పొగాకు బోర్డు అనుమతి ఇచ్చిన పరిమాణం మేర కందుకూరు-2, కలిగిరి, డీసీపల్లి, కనిగిరి కేంద్రాల్లో అమ్మకాలు పూర్తయ్యాయి. అధిక పంట ఉత్పత్తి కొనుగోళ్లపై కేంద్రం నుంచి పొగాకు బోర్డుకు ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. దీంతో ఆ నాలుగు కేంద్రాల్లో తాత్కాలికంగా వేలం నిలిపేసి మిగిలిన ఏడు కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు.