మరోసారీ మొక్కుబడి
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:38 AM
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో ప్రభుత్వ ఆదేశాలతో సెక్షన్ 51 విచారణ చేస్తున్న సహకారశాఖ అడిషనల్ కమిషనర్ గౌరీశంకర్ మరోసారి విచారణకు వచ్చారు. అయితే ఈసారి కూడా ప్రక్రియ మొక్కుబడిగానే సాగుతున్నట్లు తెలుస్తోంది.
డీసీసీబీలో సెక్షన్ 51 విచారణ
బ్యాంకు అధికారులు, డీసీవో ఆఫీసు సిబ్బందితో విచారణాధికారి భేటీ
ఒంగోలు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో ప్రభుత్వ ఆదేశాలతో సెక్షన్ 51 విచారణ చేస్తున్న సహకారశాఖ అడిషనల్ కమిషనర్ గౌరీశంకర్ మరోసారి విచారణకు వచ్చారు. అయితే ఈసారి కూడా ప్రక్రియ మొక్కుబడిగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. అందిన సమాచారం మేరకు బుధవారం ఉదయం పీడీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి వచ్చిన గౌరీశంకర్.. తొలుత బ్యాంకు సీఈవో శర్మ, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. ప్రధాన ఆరోపణలలో భాగంగా ఉన్న స్వయం సహాయక సంఘాలు, రైతుగ్రూపులు, పాలవెల్లువ పథకం కింద ఇచ్చిన రుణాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను ఇవ్వాలని వారిని కోరినట్లు సమాచారం. అలా మధ్యాహ్నం వరకు గడిపిన విచారణాధికారి సాయంత్రం జిల్లా సహకారశాఖ అధికారి కార్యాలయానికి వెళ్లి అక్కడ సిబ్బందితో భేటీ అయినట్లు తెలిసింది. గతంలో విచారణకు వచ్చిన సమయంలో ఆయన డీసీవో కార్యాలయ సిబ్బందిని కొన్ని అంశాలను పరిశీలించాలని చెప్పినట్లు సమాచారం. వాటి వివరాలను కూడా అడిగినట్లు తెలిసింది. అయితే నాలుగు నెలల్లో ఆయన విచారణ పూర్తి చేయాల్సి ఉండగా ఆ గడువు సమీపిస్తున్నప్పటికీ విచారణ ఒక కొలిక్కి రాలేదు. గతంలో మూడుసార్లు విచారణ పేరుతో వచ్చినా తూతూమంత్రంగానే సాగింది. ఈసారి కూడా అలాగే మొక్కుబడిగానే జరిగిందన్న చర్చ సహకారశాఖ వర్గాల్లో సాగుతున్నది.