ఇంకొకరు!
ABN , Publish Date - Dec 10 , 2025 | 02:30 AM
జిల్లాలో స్క్రబ్ టైఫస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సంతనూతలపాడు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన నాగేంద్రం (54) అనే మహిళ గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.
స్క్రబ్ టైఫస్‌తో మరో మహిళ మృతి
రెండుకు చేరిన మరణాలు
కొత్తగా నాలుగు కేసులు నమోదు
ఒంగోలులో కలెక్టరేట్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో స్క్రబ్ టైఫస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సంతనూతలపాడు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన నాగేంద్రం (54) అనే మహిళ గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. నాలుగురోజుల క్రితం ఎర్రగొండపాలెంకు చెందిన మహిళ ఇదే మహమ్మారి బారిన పడి ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మంగళవారం జిల్లాలో కొత్తగా నాలుగు స్క్రబ్ టైఫస్ కేసులు వెలుగు చూశాయి. అందులో ఒంగోలు, పొదిలి, కొనకనమిట్లలలో ఒక్కొక్కటి ఉన్నాయి. వారంతా ఒంగోలు రిమ్స్‌లో చేరారు. బేస్తవారపేటకు చెందిన ఓ మహిళను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన మరొక కేసు ఒంగో లులో నమోదైంది. ఇప్పటికే నలుగురు ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరు కోలుకొని వైద్యశాల నుంచి డిశ్చార్జి అయ్యారు.
ప్రజల్లో ఆందోళన
జిల్లావ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. రెండు రోజుల క్రితం దర్శి ప్రాంతంలో ఒక కేసు రాగా స్క్రబ్ టైఫస్‌గా నిర్ధారణ అయింది. ఇలా జిల్లావ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో పొలాల్లో ఉండే నల్లపురుగు కుట్టడం ద్వారా అక్కడ మచ్చలు ఏర్పడి విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నారు. అనంతరం వివిధ ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రి ఒంగోలులోని రిమ్స్ వైద్యాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.