Share News

మెప్మాలో మరో మాయ

ABN , Publish Date - Nov 26 , 2025 | 02:44 AM

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో అవినీతి డొంక కదులుతోంది. భారీగా నిధుల దోపిడీ బహిర్గతమవుతోంది. ఆర్పీలు బోగస్‌ గ్రూపులు సృష్టించి పెద్దమొత్తంలో దోచుకున్న వ్యవహారంలో ఒక్కొక్కరి పాత్ర వెలుగు చూస్తోంది.

మెప్మాలో మరో మాయ

రుణాలకు సంబంధించిన రికార్డులు గల్లంతు

బ్యాంకు లింకేజీ అధికారి తీరుపై అనుమానం

లక్ష్యాల సాధన, అదనపు ఆర్జన కోసం బోగస్‌కు బ్యాంకర్ల సహకారం

లబోదిబోమంటున్న పొదుపు మహిళలు

అవినీతిపై ఏడుగురితో విచారణ చేపట్టిన పీడీ

ఒంగోలు కార్పొరేషన్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో అవినీతి డొంక కదులుతోంది. భారీగా నిధుల దోపిడీ బహిర్గతమవుతోంది. ఆర్పీలు బోగస్‌ గ్రూపులు సృష్టించి పెద్దమొత్తంలో దోచుకున్న వ్యవహారంలో ఒక్కొక్కరి పాత్ర వెలుగు చూస్తోంది. తాజాగా కార్యాలయంలోని బ్యాంకు లింకేజీ అధికారి పాత్ర బయటపడింది. బోగస్‌లను గుర్తించి ఉన్నతాధికారులకు తెలియజేయాల్సిన ఆమె అందుకు భిన్నంగా వ్యవహరించినట్లు తెలిసింది. 2022 నుంచి బ్యాంకుల ద్వారా మంజూరైన రుణాల రికార్డులు మాయం కావడం అనేక అనుమానాలు, ఆరోపణలకు తావిస్తోంది. మెప్మాలో అవినీతి బాగోతం తవ్వేకొద్దీ బయటపడుతోంది. అక్రమార్కులు అనేక అడ్డదారులు తొక్కినట్లు వెల్లడవుతోంది. ఏకంగా రికార్డులనే మాయం చేసే స్థాయికి వ్యవహారం వెళ్లినట్లు సమాచారం. కొద్దిరోజు లుగా ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమవుతున్న కథనాలతో మెప్మా అధికారులు అప్రమత్తమ య్యారు. బోగస్‌ బాగోతం తేల్చేందుకు విచారణ కమిటీని నియమించారు. ఆ కమిటీ రెండు రోజులుగా విచారణ చేస్తోంది. బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించిన ఫైళ్లు, ఇతర సమాచారం అందించాలని విచారణాధికారులు కోరగా అవి మాయమైనట్లు తెలుస్తోంది. ఈ రికార్డులు కార్యాలయంలో పనిచేసే బ్యాంకు లింకేజీ అధికారి వద్ద ఉండాలి. ఒక్కటి కూడా లేకుండా అన్నీ కన్పించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022 నుంచి బోగస్‌ గ్రూపుల కథ మొదలైనట్లు సమాచారం.అప్పటి నుంచి నెలవారీ జాబితా, రిపోర్టులు ప్రస్తుతం కనిపించడం లేదని బ్యాంకు లింకేజీ అధికారి చెప్పడం చర్చనీయాంశమైంది. ఆమెను పూర్తిస్థాయిలో విచారిస్తేనే అసలు విషయం వెలుగు చూసే అవకాశం ఉంది. పట్టణ పొదుపు మహిళల కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. రుణాలు మంజూరు చేసి ప్రోత్సహిస్తోంది. పేద మహిళలు చిరువ్యాపారాలు చేసుకునేందుకు అవసరమైన రుణాల కోసం బ్యాంకర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కనికరించడం లేదు. రకరకాల మెలికలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. బోగస్‌ గ్రూపులకు మాత్రం కళ్లు మూసుకుని రూ.కోట్లు మంజూరు చేయడంపై అనుమానాలు కలుగుతున్నాయి. రూ.20లక్షల రుణాన్ని ఒక పొదుపు గ్రూపునకు మంజూరు చేయాలంటే వారందరు బ్యాంకు మేనేజరుకు కనిపించాలి. అలాగే మంజూరైన రుణం మొత్తం పొదుపు సభ్యుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలి. కానీ ఇక్కడ ఇవేమీ జరగలేదు. దీంతో కోట్లలో జరిగిన అవినీతిలో బ్యాంకర్ల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. టార్గెట్‌లతోపాటు కొందరు కాసులకు కక్కుర్తి పడి బోగస్‌ గ్రూపులకు సహకరించినట్లు తెలుస్తోంది. రుణాల మంజూరు చేసిన జాబితాలు బయటపెట్టకపోవడంతో బ్యాంకర్లపైనా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - Nov 26 , 2025 | 02:44 AM