Share News

ఒంగోలుకు మరో బైపాస్‌

ABN , Publish Date - Apr 10 , 2025 | 02:31 AM

ఒంగోలు నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేలా పశ్చిమం వైపు బైపాస్‌ రోడ్డు నిర్మాణంపై దృష్టిపెట్టినట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో బుధవారం సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఒంగోలుకు మరో బైపాస్‌
పశ్చిమ బైపాస్‌రోడ్డు నిర్మాణంపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను చూస్తున్న ఎంపీ మాగుంట, కలెక్టర్‌ అన్సారియా తదితరులు

పశ్చిమం వైపు ఏర్పాటుపై దృష్టి

ఎంపీ మాగుంట

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేలా పశ్చిమం వైపు బైపాస్‌ రోడ్డు నిర్మాణంపై దృష్టిపెట్టినట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో బుధవారం సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్‌ రద్దీ, ప్రమాదాలను తగ్గించడంతోపాటు గ్రానైట్‌ రవాణా చేసే వాహనాలను వెలుపల నుంచి మళ్లించేలా త్రోవగుంట నుంచి పెళ్లూరు వరకు పశ్చిమ వైపున బైపాస్‌ రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాలతోపాటు భవిష్యత్‌ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అందుకోసమే ప్రాథమికంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదే పనులు ప్రారంభించేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సంబంధిత శాసనసభ్యులతో సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామని మాగుంట తెలిపారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ మాట్లాడుతూ ఎస్‌ఎన్‌పాడులో ట్రాఫిక్‌ రద్దీని, గ్రానైట్‌ రవాణా చేసే పెద్ద వాహనాల రాకపోకలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రూపొందించేటప్పుడు ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా.. నిర్మాణ వ్యయం, సామాజిక, పర్యావరణ, ఇంజనీరింగ్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ, మేయర్‌ గంగాడ సుజాత, అధికారులు చిరంజీవి, వెంకటనాయుడు, దేవానంద్‌, బాలశంకరరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 02:31 AM