మళ్లీ అన్నదాత సుఖీభవ
ABN , Publish Date - Nov 18 , 2025 | 01:36 AM
రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు బుధవారం విడుదల కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఒక్కో రైతుకు రూ.6వేలను మూడు విడతలుగా, రాష్ట్రప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో ఏడాదికి రూ.14వేలను మూడు విడతలుగా ఇస్తున్నాయి.
రేపు రెండో విడత నిధులు విడుదల
ఆర్‌ఎస్‌కే యూనిట్‌గా కార్యక్రమాలు ఏర్పాటు
ఒంగోలు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు బుధవారం విడుదల కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఒక్కో రైతుకు రూ.6వేలను మూడు విడతలుగా, రాష్ట్రప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో ఏడాదికి రూ.14వేలను మూడు విడతలుగా ఇస్తున్నాయి. కేంద్రం ఏడేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభించింది. కేంద్రం నిధులు విడుదల చేసే రోజునే రాష్ట్రప్రభుత్వం కూడా ఇవ్వాలని నిర్ణయించింది. అలా రెండు పథకాలు కలిపి మూడు విడతలలో ఒక్కో రైతుకు రూ.20వేల వంతున లబ్ఢి చేకూరుతోంది. అందులో తొలి విడత ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన విడుదల చేశారు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత-సుఖీభవ నిధులు విడుదల కార్యక్రమాన్ని జిల్లాలోని దర్శి నియోజకర్గం తూర్పువీరాయపాలెం నుంచి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రెండో విడత నిధులను బుధవారం విడుదల చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నుంచి కార్యక్రమం నిర్వహించనున్నారు. అదేసమయంలో రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో గ్రామ స్థాయిలోని రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే) స్థాయిలో లబ్ధిదారులతో సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ పరిధిలోని లబ్ధిదారులను ఆర్‌ఎస్‌కే వద్దకు చేర్చి ముఖ్యమంత్రి పాల్గొనే సభ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రతి ఆర్‌ఎస్‌కేలో స్మార్ట్‌టీవీ ద్వారా వీక్షించేలా ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ కమిషనర్ ఆశాఖ అధికారులను అదేశించారు. అలాగే నియోజకవర్గానికి ఒకచోట స్థానిక ఎమ్మెల్యే, ఇతర కీలక నేతలు పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించాలని.. జిల్లాలోని మంత్రులు, కలెక్టర్ వంటి ఉన్నతాధికారులు కూడా ఒకచోట హాజరయ్యేలా కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇదిలాఉండగా పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల ఎంపిక నిబంధనలలో తేడాల వల్ల ఆ పథకాల లబ్ధిదారుల సంఖ్య కొంత వ్యత్యాసం ఉంది. జిల్లాలో పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు 2,31,380 మందిగా ఇప్పటికే మండలాల వారీగా ప్రకటించారు. వారికి ఆ పథకం కింద ఈ విడత ఒక్కొక్కరికి రూ.2వేల వంతున రూ.46.28 కోట్ల మేర జమ కానున్నాయి. రాష్ట్రప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ విడత ఒక్కొక్కరికి రూ.5వేలు ఇవ్వనుండగా లబ్ధిదారుల వివరాలు మంగళవారం జిల్లా అధికారులకు అందనున్నట్లు సమాచారం.