Share News

ఆ ఊరికి ఆర్‌టీసీ బస్సు వచ్చింది

ABN , Publish Date - Sep 03 , 2025 | 11:04 PM

పదేళ్ల తర్వాత ఆ గ్రామానికి ఆర్‌టీసీ బస్సువచ్చింది. గతంలో ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఆ గ్రామానికి బస్సు మాత్రం రాలేదు.

ఆ ఊరికి ఆర్‌టీసీ బస్సు వచ్చింది
బస్సు వద్ద ఎమ్మెల్యే ఏలూరి చిత్రపటంతో గ్రామస్థులు

పదేళ్ల తర్వాత వింజనంపాడుకు ఆర్టీసీ బస్‌

ఎమ్మెల్యే ఏలూరిని అభినందిస్తున్న గ్రామస్థులు

యద్దనపూడి/మార్టూరు, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : పదేళ్ల తర్వాత ఆ గ్రామానికి ఆర్‌టీసీ బస్సువచ్చింది. గతంలో ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఆ గ్రామానికి బస్సు మాత్రం రాలేదు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో బుధవారం తమ గ్రామానికి ఆర్‌టీసీ బస్సు వచ్చిందని యద్దనపూడి మండలంలోని వింజనంపాడు గ్రామస్థులు ఆనందంతో పొంగిపోయారు. గ్రామానికి రోజూ చిలకలూరిపేట నుంచి ఉదయం 8 గంటలకు వింజనంపాడు, యద్దనపూడి గ్రామాల మీదుగా పూనూరు గ్రామం వరకు బస్సు సర్వీస్‌ నడుస్తుంది. మళ్లీ అదే రూట్‌లో పూనూరు నుంచి చిలకలూరిపేట బస్టాండుకు వెళుతుంది. అంతేగాకుండా సాయంత్రం 5 గంటలకు మరోసారి ఆ సర్వీస్‌ నడుస్తుంది. ఈ గ్రామానికి 10 ఏళ్ల క్రితమే ఆర్‌టీసీ బస్‌ను నిలిపేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆర్‌టీసీ బస్సు వద్ద మహిళలు కృతజ్ఞతాపూర్వకంగా ఎమ్మెల్యే ఏలూరి చిత్రపటాన్ని ప్రదర్శించగా, టీడీపీ నాయకులు ఏలూరి రైట్‌ రైట్‌ అంటూ సంతోషాన్ని ప్రదర్శించారు. అంతేగాకుండా తమ మండలానికి చెందిన రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ కూడా సహకారం అందించారని కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు సాదినేని రంగారావు, కోడూరి నాగరాజు, సాదినేని హరిబాబు, సాదినేని సుధీర్‌, రావెళ్ల సుధీర్‌, చంద్రమౌళి పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 11:04 PM