Share News

ఆ మూడు మండలాలపై పరిశీలన

ABN , Publish Date - Dec 28 , 2025 | 01:15 AM

ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు అనుగుణంగా మూడు మండలాలను ఏ జిల్లాలో ఉంచాలనే అంశంపై ఉన్నతస్థాయిలో సమీక్ష ప్రారంభమైంది. దర్శి నియోజకవర్గంలోని దొనకొండ, కురిచేడు మండలాలు, మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలం ఏ జిల్లాలో ఉండబోతున్నాయనే అంశం చర్చనీయాంశమైంది.

ఆ మూడు మండలాలపై పరిశీలన

దొనకొండ, కురిచేడు, పొదిలి ఏ జిల్లాలోకి?

నేడు ఉపసంఘం నివేదిక

రేపు కేబినెట్‌లో తుది నిర్ణయం

ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు అనుగుణంగా మూడు మండలాలను ఏ జిల్లాలో ఉంచాలనే అంశంపై ఉన్నతస్థాయిలో సమీక్ష ప్రారంభమైంది. దర్శి నియోజకవర్గంలోని దొనకొండ, కురిచేడు మండలాలు, మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలం ఏ జిల్లాలో ఉండబోతున్నాయనే అంశం చర్చనీయాంశమైంది. ఆ మూడు మండలాలు కొత్తగా ఏర్పడుతున్న మార్కాపురం జిల్లాలో ఉంటాయా? లేక ప్రకాశం జిల్లాలోనే కొనసాగుతాయా? అన్నదానిపై ఆది, సోమవారాల్లో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అంతకు మినహా జిల్లాలో విభజనకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌లో ఇతరత్రా మార్పులు చోటుచేసుకునే అవకాశం లేదన్న విషయం తేటతెల్లమైంది. తద్వారా మార్కాపురం జిల్లా ఏర్పాటు, అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు తిరిగి ప్రకాశం జిల్లాలో కలవటం, కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు, గిద్దలూరు నియోజకవర్గంలోని మండలాలు మార్కాపురం రెవెన్యూ డివిజన్‌లో కొనసాగటం ఖాయమని తేలిపోయింది.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లాల విభజనకు సంబంధించి గతనెల చివర్లో రాష్ట్రప్రభుత్వం ప్రాఽథమిక నోటిఫికేషన్‌ ఇచ్చింది. అభ్యంతరాలు తెలిపేందుకు ఇచ్చిన గడువు ఆదివారంతో ముగియనుంది. ఆ ప్ర కారం ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులపై రెవెన్యూ శాఖ ప్రాఽథమిక నివేదికను రూపొందించింది. వాటిపై శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ అంశంపై ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదులను పరిశీలించి వాటిపై తుది నిర్ణయం తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సారథ్యంలో ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘానికి ఆయన సూచించారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు.. అలాగే అద్దంకి, కందుకూరు నియోజకవర్గా లను ప్రకాశం జిల్లాలో కలిపే అంశంపై ప్రజల నుంచి పూర్తిస్థాయి మద్దతు లభించింది. గిద్దలూరు నియోజకవర్గంలోని మండలాలను మార్కాపురం రెవెన్యూ డివిజన్‌లో కలపాలన్న ప్రతిపాదనకు కూడా ప్రజల నుంచి పూర్తి ఆమోదం లభించటం విశేషం. దీంతో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో ఈ అంశాలపై ఎలాంటి ప్రత్యేక చర్చ జరగలేదని తెలుస్తోంది.

మూడు మండలాలపై చర్చ

దర్శి నియోజకవర్గం మొత్తాన్ని ఒంగోలు కేంద్రంగా ఉన్న ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని ఆ నియోజకవర్గంలోని మొత్తం మండలాలను అద్దంకి రెవెన్యూ డివిజన్‌లో కలపాలని చేసిన ప్రతిపాదనపై దొనకొండ, కురిచేడు మండలాలకు సంబంధించి కొన్ని పిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. దొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురం జిల్లాలో కలపాలన్న వినతులు వచ్చిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అదేసమయంలో మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మండలం నుంచి కొందరు ఆ మండలాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని కోరుతూ వినతిపత్రాలు ఇచ్చారు. వీటిపై ఏం చేద్దాం? అని సమావేశంలో పాల్గొన్న వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం సీఎం చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో సమావేశంలో పాల్గొన్న వారి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. మొత్తంగా దొనకొండ మండలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలన్న విజ్ఞప్తులే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పిర్యాదులను మనం పరిశీలించాల్సిన అవసరం ఉందని, ఈ మూడు మండలాల అంశంపై మరోసారి లోతుగా అధ్యయనం చేసి తెలపాలని ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించినట్లు తెలిసింది. ఈనెల 31తేదీకి తుది నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉన్నందున మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాన్ని ఆదివారం సాయంత్రానికి తెలపాలని కూడా సూచించారు. అనంతరం ఉపసంఘం ఇచ్చే నివేదికను సీఎం పరిశీలించి సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.

వాటిపై మిశ్రమ స్పందన

తాజా ప్రతిపాదనలపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. దర్శి నియోజకవర్గంలో మిగిలిన మూడు మండలాలను ప్రకాశం జిల్లాలోనే ఉంచుతున్నం దున దొనకొండ, కురిచేడు మండలాల విషయంలో కొత్త ఆలోచన సరైంది కాదన్న అభిప్రాయం ఆ నియోజకవర్గంలో ఎక్కువ మంది నుంచి వస్తోంది. దొనకొండ మండలంలో మిశ్రమ అభిప్రాయం ఉన్నప్పటికీ కురిచేడు మండలంలో అత్యధిక శాతం ప్రజలు ప్రకాశంలోనే ఉండాలని కోరుకోవడం వినిపించింది. పొదిలి మండలం ప్రస్తుతం మార్కాపురం నియోజకవర్గంలో ఉంది. ఆ నియోజకవర్గంలోని మిగిలిన ప్రాంతాల వారు పొదిలి మండలం మార్కాపురం జిల్లాలోనే ఉండాలని కోరుతున్నారు. పొదిలి ప్రాంతవాసులు మాత్రం ఒంగోలు అందుబాటులో ఉన్నందున అటువైపు మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉంటే బాగుంటుందన్న ఆలోచనకు ప్రాధ్యాన్యత ఇస్తారా? లేక జిల్లాకేంద్రం అందుబాటులో ఉండటం అనే అంశానికి ప్రాధాన్యతఇస్తారా? అనేది వేచిచూడాల్సి ఉంది.

Updated Date - Dec 28 , 2025 | 01:15 AM