Share News

పట్టణ ప్రజలకు అమృత్‌ ఘడియలు

ABN , Publish Date - Jul 20 , 2025 | 01:30 AM

ప్రస్తుత ప్రభుత్వం రాకతో పట్టణ ప్రాంతాల్లోని ప్రజల నీటి కష్టాలు తీరనున్నాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిధులతో అమలు చేస్తున్న అమృత్‌-2 కింద జిల్లాకు రూ.744.34 కోట్లు మంజూరు కావడంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

పట్టణ ప్రజలకు అమృత్‌ ఘడియలు
రామతీర్థం జలాశయం

తాగునీటి అవసరాల కోసం రూ.744.34 కోట్లు మంజూరు

అమృత్‌-2లో ఒంగోలు, పొదిలి, మార్కాపురం, దర్శికి నిధులు

నగరానికి ఈసారి రామతీర్థం నుంచి సరఫరా

తొలిదశ పనులకు 2016లో ఒంగోలులో చంద్రబాబు శంకుస్థాపన

2017లో ప్రారంభించిన వెంకయ్యనాయుడు

భవిష్యత్‌తరాల నీటి అవసరాలకు అనుగుణంగా రెండో దశ పనులు

మళ్లీ టీడీపీ ప్రభుత్వం రాకతో తీరనున్న నీటి కష్టాలు

ప్రస్తుత ప్రభుత్వం రాకతో పట్టణ ప్రాంతాల్లోని ప్రజల నీటి కష్టాలు తీరనున్నాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిధులతో అమలు చేస్తున్న అమృత్‌-2 కింద జిల్లాకు రూ.744.34 కోట్లు మంజూరు కావడంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. 2016లో తెలుగుదేశం హయాంలోనే ప్రారంభమైన ఈ పథకం పనులు కొంతమేర జరిగాయి. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజల నీటి కష్టాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గడిచిన ఐదేళ్లు బిందెడు నీటి కోసం బారులు తీరిన రోజులూ ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పథకం కింద మరిన్ని నిధులు మంజూరయ్యాయి.

ఒంగోలు కార్పొరేషన్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : పట్టణ ప్రాంత వాసుల నీటి ఇబ్బందులకు పరిష్కారం లభించింది. ఎట్టకేలకు ప్రభుత్వం తాగునీటి పథకాల కోసం నిధులు మంజూరు చేసింది. అమృత్‌-2 కింద ఒంగోలుకు రూ.424.42 కోట్లు, మార్కాపురానికి రూ.63.14 కోట్లు, పొదిలికి రూ.126.17 కోట్లు, దర్శికి రూ.130.61 కోట్లు కేటాయించింది. దీంతో ఒంగోలు నగరంతోపాటు పశ్చిమంలోని పట్టణ ప్రాంత ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

2016లో ఒంగోలులో శంకుస్థాపన

నగరాలు, పట్టణాల్లో పెరుగు తున్న జనాభాకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక సదు పాయాలు, అభివృద్ధి, స్మార్ట్‌ లుక్‌ తీసుకురావడానికి 2016లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం పలికింది. అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం ‘అమృత్‌’ పేరిట పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణ ప్రాం తాల్లో తొలి విడతగా కొన్నింటిని ఈ పథకం కింద ఎంపిక చేసింది. అం దులో నాడు ఒంగోలుకు ప్రాధాన్యం లభించింది. తొలుత రూ.330 కోట్లు అవసరమని అధికారులు కోరారు. ఒకేసారి అంతమొత్తం విడుదల సాధ్యపడకపోవడంతో ఒంగోలుకు రూ.123 కోట్లు మంజూరు చేశారు. దీంతో 2016 మేలో నాటి ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు నగరంలోని ప్రకాశం భవనం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

2017లో ప్రారంభించిన వెంకయ్య నాయుడు

2017 మేలో అప్పటి పట్టణా భివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంక య్యనాయుడు ఒంగోలులో 77 శాతం పూర్తయిన పనులను ప్రారంభించారు. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో నేటికీ పట్టణ ప్రాంతాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో తిరిగి అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్రానికి ప్రతిపాదనలు పంపి అధిక మొత్తంలో నిధులు రాబట్టింది. ఈ పథకం కింద రెండో విడతలో ఒంగోలుతోపాటు, మార్కాపురం, పొదిలి, దర్శి మునిసిపాలిటీలను కూడా చేర్చడంతోపాటు రూ.744.34 కోట్లు మంజూరు చేసింది.

నిధుల వినియోగం ఇలా..

అమృత్‌-2 కింద ఒంగోలు కార్పొరేషన్‌కు రెండు ప్యాకేజీల్లో రూ.424.42 కోట్లను ఖర్చు చేయనున్నారు. మొదటి ప్యాకేజీలో తాగునీటి అవసరాలకు సంబంధించిన నిర్మాణ పనులకు రూ. 320.05 కోట్లు, పది సంవత్సరాల నిర్వహణకు రూ.61.25 కోట్లు కేటాయించారు. ప్యాకేజ్‌-1లో 18 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, మూడు ఫిల్టర్‌ బెడ్‌లు నిర్మించనున్నారు. 535 కి.మీ పాతపైపులైనులు తొలగించి కొత్త పైపులైనులు వేయనున్నారు. రెండో ప్యాకేజీ కింద రూ.42.72 కోట్లు కేటాయించారు. వీటిలో ఒక ఫిల్టర్‌ బెడ్‌, 35 కి.మీ పైపులైను నిర్మాణానికి రూ.34.68 కోట్లు, నిర్వహణకు 8.04 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇలా ఒంగోలుకు కేటాయించిన పూర్తి నిధులు తాగునీటి అవసరాల కోసమే వినియోగించనున్నారు. అమృత్‌-2 కింద రామతీర్థం నుంచి ఒంగోలు వాసులకు తాగునీటిని అందించనున్నారు.

పశ్చిమ ప్రజలకు తీరనున్న నీటి కష్టాలు

పశ్చిమంలోని మార్కాపురం మునిసిపాలిటీకి ప్రభుత్వం రూ.63.14 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో వెలిగొండ ప్రాజెక్టు గొట్టిపడియ సోర్సు ద్వారా మార్కాపురం మునిసిపల్‌ ప్రాంత ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చనున్నారు. మరోవైపు దర్శి మునిసిపాలిటీలో రూ.130.61 కోట్ల పనులను పబ్లిక్‌ హెల్త్‌ అధికా రుల ద్వారా చేపట్టనున్నారు. పొదిలి మునిసిపాలిటీకి కేటాయించిన రూ. 126.17 కోట్లను తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ఖర్చు చేయనున్నారు.

Updated Date - Jul 20 , 2025 | 01:30 AM