ప్రజా ప్రభుత్వ పాలనలో హామీలన్నీ అమలు
ABN , Publish Date - Jun 12 , 2025 | 11:32 PM
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 80 శాతం సంవత్సరానికే అమలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా గురువారం పట్టణంలో విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఎమ్మెల్యే నారాయణరెడ్డి
కదంతొక్కిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు
గ్రామగ్రామాన ఏడాది పాలన విజియోత్సవాలు
మార్కాపురం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 80 శాతం సంవత్సరానికే అమలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా గురువారం పట్టణంలో విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. అల్లూరి పోలేరమ్మ దేవస్థానం వద్ద నుంచి 10.30 గంటలకు ర్యాలీ ప్రారంభమైంది. సుమారు 3 వేల బైక్‌లపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పెద్దఎత్తున నినాదాలు చేసుకుంటూ ఆయా పార్టీల జెండాలతో బైక్‌లపై కార్యకర్తలు, యువత కేరింతలు కొట్టారు. పూలసుబ్బయ్య కాలనీ, కరెంట్ ఆఫీస్, ఆర్టీసీ బస్టాండ్, కంభం సెంటర్, గడియార స్తంభం సెంటర్, మెయిన్ బజార్, రథం బజార్, నాయుడువీధి, కాలేజీ రోడ్డు మీదుగా సెవెన్ హిల్స్ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడారు. ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తున్నామన్నారు. కొద్ది రోజుల్లో తల్లికి వందనం, రైతులకు రూ.20 వేల సాయం అందుతుందన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందన్నారు. పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. మరోపక్క వైసీపీ నాయకులు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో నిమగ్నమయ్యారన్నారు. చివరికి రాజధాని అమరావతి మహిళలను తన మీడియా ద్వారా వైసీపీ అధినేత జగన్ కించపరిచే విధంగా వ్యా ఖ్యలు చేయించడం వారి మానసికస్థితికి నిదర్శనమన్నారు. ఇలాంటి వ్యక్తులను ప్రజలు దరిచేరనివ్వరన్నారు. పశ్చిమ ప్రకాశానికి ఏమీ చేయని జగన్ సిగ్గులేకుండా పర్యటనకు వచ్చి విధ్వంసం సృష్టించి వెళ్లారన్నారు. వెలుగొండ ప్రాజెక్టు, మార్కాపురం జిల్లా ఏర్పాటుపై సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలపై రాళ్లు, చెప్పులతో దాడులు చేయించడం దుర్మార్గచర్యగా పేర్కొన్నారు. త్వరలో ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు రూ.390కోట్లతో టెండర్లు పిలవడం జరుగుతుందన్నారు. మార్కాపురం, పొదిలి పట్ణణాల్లో కూడా మంచి నీటిని అందించేందుకు రూ.200కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే కందుల తెలిపారు. అనంతరం భారీ కేక్‌ను కట్ చేసి కార్యకర్తలకు పంచారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున్, మాలపాటి వెంకటరెడ్డి, పఠాన్ ఇబ్రహీంఖాన్, జనసేన, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఇమ్మడి కాశీనాథ్, పీవీ కృష్ణారావు, అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెద్దారవీడు : అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ మండలాధ్యక్షుడు మెట్టు శ్రీనివాసులరెడ్డి అన్నారు. దేవరాజుగట్టులోని టీడీపీ మండల కార్యాలయంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్‌కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు డి.వెంకటేశ్వరరెడ్డి, మాజీ జడ్పీటీసీ జడ్డా రవి, నాయకులు ఆనెకాళ్ల శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.
తర్లుపాడు : అన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఏడాది పాలన సంబరాలు అంబరాన్నంటాయి. తర్లుపాడులో నాయకులు కేక్ కట్ చేసి పురవీధుల్లో బైకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఉడుముల చిన్నపురెడ్డి, పి.గోపీనాథ్ చౌదరి, కంచెర్ల కాశయ్య, లక్ష్మీయ్య, సుబ్బయ్య, మండలయూత్ అధ్యక్షుడు వెంకట్ పాల్గొన్నారు.
గిద్దలూరు టౌన్ : ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైన సందర్భంగా గురువారం పట్టణంలో విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను టీడీపీ నాయకుడు ముత్తుముల కృష్ణకిశోర్‌రెడ్డి కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా అభిమానులు టపాసులను పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కృష్ణకిశోర్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శ్రమిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఈ ఏడాదిలో రూ.400కోట్లతో అభివృద్ది కార్యక్రమాలను పూర్తి చేశారన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకటసుబ్బయ్య, సొసైటీ బ్యాంక్ చైర్మన్ బాలీశ్వరయ్య, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, సయ్యద్ షానేషావలి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కంభం : ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం కంభం, అర్ధవీడు మండలాల్లో టీడీపీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కందులాపురం పంచాయతీ ఆవరణలో కేక్ కట్ చేసిన అనంతరం కంభం బాలికోన్నత పాఠశాలలో సన్న బియ్యంతో చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు ముత్తుముల కృష్ణకిశోర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం కందులాపురం సెంటర్‌లో పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
కొమరోలు : ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ వస్తోందని టీడీపీ మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు అన్నారు. ఎంపీటీసీ మాజీ సభ్యుడు ముత్తుముల సంజీవరెడ్డి ఇంటి ఆవరణలో గురువారం భారీ కేక్‌ను కట్‌చేసి స్వీట్లు పంచిపెట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆంజనేయస్వామి గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. రాజుపాలెంలో విజయోత్సవ ర్యాలీని గిద్దలూరు ఏఎంసీ వైస్ చైర్మన్ గోడి ఓబులరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు తిరుమలరెడ్డి, షేక్ హసీనా, సొసైటీ మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నియోజకవర్గ రైతు నాయకుడు రవింద్రారెడ్డి పాల్గొన్నారు.
బేస్తవారపేట : టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కార్యక్రమంలో భూపాల్‌రెడ్డి, సోరెడ్డి మోహన్‌రెడ్డి, రాము, సైదులు, కృష్ణ యాదవ్ పాల్గొన్నారు.
పెద్దదోర్నాల : ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా విజయోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. నాయకులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు బట్టు సుధాకర్ రెడ్డి, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, చంటి, సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, చెన్నారెడి, శివారెడ్డి పబ్బతి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం : టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా గురువారం టీడీపీ కార్యాలయంలో విజయోత్సవాలను టీడీపీ నాయకులు నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, మాజీ ఎంపీపీ మంత్రునాయక్, మాజీ సర్పంచి కంచర్ల సత్యనారాయణగౌడ్, గోళ్ల సుబ్బారావు, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, మల్లికార్జున, ఎంపీటీసీ మాజీ సభ్యుడు అచ్యుతరావు, కొత్తమాసు సుబ్రమణ్యం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
త్రిపురాంతకం : ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పల్లెల్లో సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రమైన త్రిపురాంతకంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో కేకు కట్ చేశారు. పలు గ్రామాల్లో కార్యకర్తలు స్వచ్ఛందంగా కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఏడాది పాలనలో ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను పలువురు నాయకులు వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్‌లు పెంచిన విషయంతోపాటు పలు గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా మురికిరోడ్లుగా ఉన్నవాటిని పల్లెపండుగ పేరుతో వేసిన సిమెంట్ రోడ్ల పరిస్థితిని ప్రజలకు నాయకులు వివరించారు.