Share News

అయకట్టంతా అయ్యోమయం

ABN , Publish Date - Aug 12 , 2025 | 02:48 AM

ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది సాగర్‌ నీటి సరఫరాపై గందరగోళ పరిస్థితి నెలకొంది. కృష్ణమ్మ పరవళ్లతో డ్యామ్‌లు నిండటంతో నీటి సరఫరాకు ఢోకా ఉండదన్న ఆనందంతో పంటల సాగుకు ఉపక్రమించిన రైతుల్లో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. కాలువల్లో నీటి సరఫరా హెచ్చు, తగ్గులు ఇందుకు కారణమయ్యాయి.

అయకట్టంతా అయ్యోమయం

సాగర్‌ నీటి సరఫరాలో గందరగోళం

సాధారణం కన్నా నెల ముందే విడుదల

కృష్ణమ్మకు భారీ వరదలతో కాలువలకు నీటిని ఇచ్చిన ప్రభుత్వం

సాగుకు ఉపక్రమించిన రైతులు

డ్యామ్‌ గేట్ల మూసివేత సమయంలో ఇచ్చే నీరు అధికారిక కోటాగా గుర్తింపు

ఇప్పుడే ఇస్తే సంక్రాంతి తర్వాత ఇక్కట్లు

జాగ్రత్తపడుతున్న అధికారులు

కాలువలకు నీటి సరఫరా పరిమాణం తగ్గుతుండటంపై రైతుల్లో ఆందోళన

వెంటనే పెంచాలని డిమాండ్‌

స్పష్టత ఇవ్వలేకపోతున్న అధికారులు

ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది సాగర్‌ నీటి సరఫరాపై గందరగోళ పరిస్థితి నెలకొంది. కృష్ణమ్మ పరవళ్లతో డ్యామ్‌లు నిండటంతో నీటి సరఫరాకు ఢోకా ఉండదన్న ఆనందంతో పంటల సాగుకు ఉపక్రమించిన రైతుల్లో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. కాలువల్లో నీటి సరఫరా హెచ్చు, తగ్గులు ఇందుకు కారణమయ్యాయి. నీటి సరఫరాను పర్యవేక్షించే జలవనరులశాఖ అధికారుల్లోనూ అయోమయ పరిస్థితి కనిపిస్తోంది. డ్యామ్‌కు వరదనీరు భారీగా వస్తూ గేట్లు ఎత్తి సముద్రానికి వదిలే సమయంలో కాలువలకు ఇచ్చే నీటిని వరద నీరుగానే కేఆర్‌ఎంబీ, తెలంగాణ ప్రభుత్వాలు గుర్తిస్తాయి. అలాకాకుండా డ్యామ్‌ గేట్ల మూసివేత అనంతరం ప్రత్యేకంగా కాలువల ద్వారా ఇచ్చే నీటిని ఆ సీజన్‌ అధికారిక కోటా కిందనే పరిగణిస్తారు. దీంతో ముందుగానే నీరిస్తే వాటా మేరకు పూర్తయి సంక్రాంతి తర్వాత అవసరానికి సరిపడా రాక అవస్థలు పడాల్సి వస్తుందని అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ఉత్సాహంగా సాగుకు ఉపక్రమించిన రైతులు మాత్రం కాలువలకు సరఫరా తగ్గడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఒంగోలు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : సాగర్‌ కాలువల పరిధిలో ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లోని 11 లక్షల ఎకరాల ఆయకట్టులో సాగు, రెండు ఉమ్మడి జిల్లాల్లో తాగునీటి అవసరాలకు 132 టీఎంసీల నీరు కేటాయింపు ఉంది. అందులో 4.34 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా 57 టీఎంసీలు (44శాతం) వినియోగించుకోవాలి. ఈ కేటాయింపులు దశాబ్దాల క్రితం చేశారు. దీంతో వాటా ప్రకారం ఉమ్మడి జిల్లాకు 57టీఎంసీల నీరు సరిపోవడం లేదు. దాదాపు 70టీఎంసీలపైన అవసరమవుతోంది. అది కూడా పుష్కలంగా వర్షాలు కురిసి, నీటి వాడకం తక్కువగా ఉండే ఆరుతడి పంటల్లో మొక్కజొన్న, పొగాకు వేస్తేనే. లేకపోతే 70 టీఎంసీల కన్నా ఎక్కువే అవసరమవుతుంది. వర్షాలు లేక బెట్టవాతావరణం నెలకొన్నప్పుడు, ఎగువన ఉన్న పల్నాడు జిల్లాలో రెండో పంట సాగు చేస్తే సంక్రాంతి తర్వాత ఉమ్మడి ప్రకాశంలో నీటి ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. గత ఏడాది కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. ఆ సీజన్‌లో కూడా ముందుగానే నీరు ఇవ్వడంతో రైతులు సాగు చేపట్టగా ఫిబ్రవరి, మార్చిలలో డ్యామ్‌లో నీరు లేక అవస్థలు పడాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది సాగుకు సెప్టెంబరు 1నుంచి నీటిని ఇవ్వాలని అంతకు పక్షంరోజుల ముందు తాగునీటికి ఇవ్వాలని జిల్లా అధికారులు సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించారు. ఆ ప్రకారమే ప్రణాళిక రూపొందించుకోవాలని ఉన్నతాధికారుల నుంచి జిల్లా యంత్రాంగానికి సూచనలు వచ్చాయి. అందుకు వీలుగా వేసవిలో తాగుకు ఇక్కట్లు పడకుండా జూన్‌లో ఒకసారి నీటిని కూడా ఇచ్చారు.

అనూహ్యంగా ముందస్తుగానే కాలువలకు నీరు

ఈ ఏడాది కృష్ణానదికి మరింత ముందుగా వరదలు వచ్చాయి. జూలై తొలిపక్షంలోనే డ్యామ్‌లకు భారీగా వరద నీరు రావడం ప్రారంభమైంది. దీంతో జూలై ఆఖరులోపే సాగర్‌ డ్యామ్‌ గేట్లను కూడా ఎత్తేశారు. కాలువలకు కూడా నీటిని వదిలారు. తదనుగుణంగా జిల్లాకు జూలై ఆఖరుకు నీరు వచ్చింది. అదేసమయంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తుండటంతో పూర్తి స్థాయిలో కాలువలకు నీటిని సరఫరా చేశారు.

ఒక్కసారిగా కాలువల్లో తగ్గిన సరఫరా

కృష్ణమ్మ పరవళ్లు, డ్యామ్‌లకు భారీగా వరద నీరు రావడాన్ని గుర్తించిన ఆయకట్టు రైతులు అందుబాటులో ఉన్న బోర్లు, చెరువులు, బావుల కింద వరి నార్లు పోశారు. కాలువల నీరు రావడంతోనే నాట్లకు కూడా ఉపక్రమించారు. ఈ తరుణంలో వారం తిరక్కుండానే సాగర్‌ కాలువలకు ఒక్కసారిగా నీటి సరఫరా తగ్గిపోయింది. జూలై ఆఖరులో జిల్లా సరిహద్దు 85/3 వద్ద దాదాపు 3వేల క్యూసెక్కుల నీరు సరఫరా కాగా, ప్రస్తుతం 800 క్యూసెక్కులకు పడిపోయింది.

ఎందుకు తగ్గించారంటే..

డ్యామ్‌కు వరద నీరు భారీగా వస్తూ గేట్లు ఎత్తి సముద్రానికి వదిలే సమయంలో కాలువలకు ఇచ్చే నీటిని కూడా వరద నీరుగానే కేఆర్‌ఎంబీ, తెలంగాణ ప్రభుత్వాలు గుర్తిస్తాయి. అలా కాకుండా డ్యామ్‌ గేట్లు మూసివేత సమయంలో డ్యామ్‌ నిండా నీరు ఉన్నా కాలువలకు ప్రత్యేకంగా ఇచ్చే నీటిని ఆ సీజన్‌ అధికారిక కోటా కిందనే పరిగణిస్తారని తేలింది. వారం క్రితం డ్యామ్‌గేట్లు మూసివేయగా అప్పటి నుంచి ఇచ్చే నీటిని అధికారిక కోటా కింద లెక్కిస్తే ముందుగానే వాడకం కోటా పూర్తవుతుంది. అదే జరిగితే సంక్రాంతి తర్వాత ఇక్కట్లు పడాల్సి వస్తుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా కాలువల్లో సరఫరా తగ్గించివేసినట్లు సమాచారం.

స్పష్టత ఇవ్వలేకపోతున్న అధికారులు

ముందుగానే నీటి సరఫరాతో ఉత్సాహంగా సాగుకు ఉపక్రమించిన సాగర్‌ ఆయకట్టు రైతులు తాజా పరిస్థితితో ఆందోళన చెందుతున్నారు. సాగు విషయంలో స్థానిక అధికారుల నుంచి స్పష్టత కూడా లేకపోవడంతో మరింత కలవరపడుతున్నారు. పక్షం క్రితం డ్యామ్‌ గేట్లు ఎత్తి సముద్రానికి నీరు వదిలినప్పుడు కాలువలకు పుష్కలంగా నీరు రావడం, వారం క్రితం గేట్లు మూశాక తగ్గించడం, ఇప్పుడు మళ్లీ డ్యామ్‌ గేట్లు ఎత్తడంతో మరోసారి కాలువలకు నీటి సరఫరా మెరుగుపడే అవకాశం ఉండటంతో వారిలోనూ అయోమయ పరిస్థితి కనిపిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా మరోపక్షం తర్వాత నాట్లు వేసుకోవడమే మంచిదన్న అభిప్రాయాన్ని ఆశాఖలో అనుభవం ఉన్న ఓ కీలక అధికారి వ్యక్తం చేశారు.

Updated Date - Aug 12 , 2025 | 02:48 AM