అంతా అప్రమత్తం
ABN , Publish Date - Oct 22 , 2025 | 01:07 AM
జిల్లాపై తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. సోమవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. ప్రత్యేకించి తూర్పు, దక్షిణ ప్రాంతాలలో అధికంగా కురుస్తోంది. మంగళవారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో జిల్లాలో సగటున 8.70 మి.మీ వర్షపాతం నమోదైంది. తిరిగి మంగళవారం పగటిపూట తెరపి లేకుండా జల్లులు పడుతున్నాయి.
మొదలైన తుఫాన్ ప్రభావం
ఒంగోలులో భారీ వర్షం
ఇతర చోట్ల ఒక మోస్తరుగా..
నేడు, రేపు భారీ వర్ష సూచన
యంత్రాంగం అలర్ట్
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం
1077 నెంబరు కేటాయింపు
ఒంగోలు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాపై తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. సోమవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. ప్రత్యేకించి తూర్పు, దక్షిణ ప్రాంతాలలో అధికంగా కురుస్తోంది. మంగళవారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో జిల్లాలో సగటున 8.70 మి.మీ వర్షపాతం నమోదైంది. తిరిగి మంగళవారం పగటిపూట తెరపి లేకుండా జల్లులు పడుతున్నాయి. బంగాళాఖాతంలోని అల్పపీడనం మరింత బలపడి బుధవారం మధ్యాహ్నానికి వాయుగుండంగా.. అనంతరం తుఫాన్‌గా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సమాచారం ఇచ్చింది. దాని వల్ల బుధ, గురువారాల్లో విస్తా రంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ప్రత్యేకించి తీర ప్రాంతంలోని మండలాల్లో అధికారులను మరింత అప్రమత్తం చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. దానికి 1077 నంబరును కేటాయించారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని కోరారు. ఇప్పటికే వెళ్లిన వారు తక్షణం వెనక్కు వచ్చేవిధంగా అప్రమత్తం చేశారు.
నగర వీధులన్నీ జలమయం
ఒంగోలు నగరంలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ప్రధాన వీధులు కాలువలు, చెరువు లను తలపించాయి. సింగరాయకొండ, టంగుటూరు. కొత్తపట్నం, ఒంగోలు, జరుగుమల్లి, సంతనూత లపాడు, చీమకుర్తితోపాటు కనిగిరి నియోజకవ ర్గంలోని పలు మండలాల్లోనూ మంగళవారం పగలు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం : కలెక్టర్ రాజాబాబు
జిల్లాకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ రాజాబాబు వెల్లడించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. తీరప్రాంతంలోని ఐదు మండలాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. అవసరమైన పక్షంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌లో కంట్రోలు రూంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడ 24 గంటలు విద్యుత్, పోలీస్, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య, రెవెన్యూ, పశుసంవర్థక శాఖల సిబ్బందికి విడతల వారీగా విధులు కేటాయించినట్లు చెప్పారు.