యూరియాపై అప్రమత్తం
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:42 AM
జిల్లాలో యూరియా సమస్యపై అఽధికార యంత్రాంగం సీరియస్‌గా దృష్టి సారించింది. సీజన్ సరిలేక, పంటలు సాగు కాక.. ఎరువుల వినియోగం అంతగా లేకపోయినా కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంది.
దాడులు.. అవగాహన
ఎరువుల డీలర్లతో కలెక్టర్ సమీక్ష
జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న దాడులు
ఇప్పటి వరకు 259 దుకాణాలు తనిఖీ
6ఏ కేసులు 12 నమోదు
రూ.39.24లక్షల విలువైన ఎరువులు సీజ్
ఈనెలలో 4,273 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం
ఇప్పటికే 3,752 ఎంటీలు నిల్వ
నేడు మరో 1,587 మెట్రిక్ టన్నులు రాక
కొరత లేదంటున్న డీఏవో శ్రీనివాసరావు
నామమాత్రంగా సాగిన వైసీపీ నిరసనలు
జిల్లాలో యూరియా సమస్యపై అఽధికార యంత్రాంగం సీరియస్‌గా దృష్టి సారించింది. సీజన్ సరిలేక, పంటలు సాగు కాక.. ఎరువుల వినియోగం అంతగా లేకపోయినా కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంది. తదనుగుణంగా జిల్లాలో యంత్రాంగం యూరియా వాడకం, దానివలన కలిగే అనర్థాలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. అలాగే అక్రమ పద్ధతుల్లో ఎరువులను విక్రయిస్తే ఎదురయ్యే పరిణామాలపై వ్యాపారులకు హెచ్చరికలు చేస్తోంది. మరోవైపు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. కాగా వైసీపీ మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమం జనం లేక పేలవంగా సాగింది.
ఒంగోలు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : దాదాపు పక్షం రోజుల క్రితం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో యూరియా కొరత ఏర్పడింది. అయితే ఉన్న సమస్యకన్నా ఎక్కువగా అసత్య ప్రచారాలు సాగుతుండటంతో భవిష్యత్‌లో దొరకదేమోనన్న అనుమానంతో తక్షణం అవసరం లేకపోయినా యూరియా కొనుగోలుకు పలు ప్రాంతాల రైతులు మొగ్గు చూపారు. దానిని ఆసరా చేసుకొని అధిక ధరలకు విక్రయిం చే ప్రయత్నం కూడా కొన్నిచోట్ల వ్యాపారులు చేశారు. పరిస్థితిని గుర్తించిన జిల్లా యంత్రాంగం తక్షణం దుకాణాలలో తనిఖీలు చేపట్టింది. కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాలతో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. స్వయంగా జేసీ గోపాలకృష్ణ, వ్యవసాయశాఖ అధికారి సీహెచ్.శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. మరోవైపు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో విజిలెన్స్, పోలీస్ అధికారులు సైతం విస్తృత దాడులు చేశారు. అలా నాలుగైదుశాఖల అధికారులు ఎడాపెడా దాడులు చేయడం ఇటీవల కాలంలో ఇదేకావడంతో ఎరువుల వ్యాపారులు బెంబేలెత్తిపోయారు.
259 దుకాణాలలో తనిఖీలు
జిల్లాలో మొత్తం 529 ఎరువుల దుకాణాలు లైసెన్సులు పొంది ఉన్నాయి. అందులో 355 షాపుల వారు మాత్రమే వ్యాపారంలో ఉన్నారు. వాటిలోని 259 దుకాణాలలో ఇప్పటివరకు ఆయా శాఖల అధికారులు దాడులు చేశారు. ఆ సందర్భంగా పలు అవకతవకలు, అక్రమాలు ఉన్నట్లు గుర్తించి 12 దుకాణాలపై 6ఏ కేసులు, ఒక దుకాణంపై 6ఏతోపాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. సుమారు రూ.39.24లక్షల విలువైన 219.04 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలను నిలిపేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దాడులను నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయించారు. అదే సమయంలో జిల్లాలో అవసరాలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచే చర్యలు చేపట్టారు. ఈనెలలో జిల్లాలో 4,273 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందుకు సంబంధించి సోమవారం వరకు 3,752 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. అందులో 1,356 మెట్రిక్ టన్నులు రైతు సేవా కేంద్రాలలో, 1,313 మెట్రిక్ టన్నులు రిటైల్ డీలర్లు, 878 మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్ వద్ద నిల్వ ఉండగా మిగిలింది ఇతర సంస్థల వద్ద ఉంది.
యూరియా వస్తోంది..
ఆర్‌సీఎఫ్ కంపెనీ నుంచి 300 టన్నుల ఎరువులు సోమవారం రాత్రి జిల్లాకు వచ్చాయి. బుధవారం 1,310 టన్నులు కోరమండల్, 275 టన్నులు పీపీఎల్ కంపెనీల నుంచి జిల్లాకు రానుంది. అలా అవసరం కన్నా అధికంగానే ఎరువు అందుబాటులో ఉండనుండగా 70శాతం సొసైటీలు, ఆర్‌ఎస్‌కేలకు, 30శాతం డీలర్లకు ఇచ్చేలా నిర్ణయించారు. మరోవైపు ఎరువులు ప్రత్యేకించి యూరియా విక్రయాలపై డీలర్లకు, వాడకంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందుకోసం మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ఎరువుల డీలర్లతో కలెక్టర్ అన్సారియా నేతృత్వంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జేసీ గోపాలకృష్ణ, డీఏవో శ్రీనివాసులు పాల్గొని ఎరువుల విక్రయాలలో అవకతవకలు జరిగితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే యూరియా వాడకంపై రైతులకు కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
సరిపడా నిల్వలు ఉన్నాయి..
జిల్లావ్యాప్తంగా మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఈ అంశాన్ని ప్రధానంగా చేపట్టారు. అధిక యూరియా వాడకం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని తొలివిడత నేలలో యూరియా వాడి అనంతరం మొక్కలపై స్ర్పే చేసే నానో యూరియాను వాడాలని సూచించారు. అలాగే జిల్లాలో యూరియా కొరత లేదని అవసరానికి మించి కొనుగోలు చేయరాదని రైతులకు వివరించారు. కాగా జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని అవసరానికి సరిపడా నిల్వలు ఉన్నాయని రైతులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని డీఏవో శ్రీనివాసరావు కోరారు. ఇదిలా ఉండగా యూరియా కొరత అంటూ వైసీపీ చేపట్టిన నిరసనలు నామమాత్రంగా సాగాయి. ఆ పార్టీ కార్యకర్తలకే పరిమితమయ్యారు.