మొంథాపై అప్రమత్తం
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:33 PM
సోమవారం నుండి ముంతా తుఫాన్ ప్రభావం ఉండబోతుందని వాతావరణశాఖ హెచ్చరించడంతో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఆదివారం ఎంపీడీవో, పోలీసుశాఖ, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): సోమవారం నుండి ముంతా తుఫాన్ ప్రభావం ఉండబోతుందని వాతావరణశాఖ హెచ్చరించడంతో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఆదివారం ఎంపీడీవో, పోలీసుశాఖ, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే సగిలేరువాగు, కంభం మండలంలో గుండ్లకమ్మ వాగులు ప్రవహిస్తున్నాయని, వాటి ప్రవాహంలో ఉదృతిని ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. తాను ఇప్పటికే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించానని, పలు మండలాల్లో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఎవరైనా పాత భవనాలలో నివాసం ఉన్న వారిని సచివాలయ సిబ్బంది ద్వారా గుర్తించాలన్నారు. గ్రామస్థాయిలో ముంతా తుఫాన్ ప్రభావంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని, లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలకు సమస్యత ఏర్పడితే తక్షణమే సిబ్బందికి గానీ, తనకు గాని ఫోన్ చేయాలని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు.
ముంతా తుఫాన్ ప్రభావంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆదివారం తహసీల్దార్ ఆంజనేయరెడ్డి అధ్యక్షతన అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్, పోలీసు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, అగ్నిమాపకం, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ముందస్తు చర్యలు
మార్కాపురం : జిల్లాపై ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రభావం చూపనున్న మొంథా తుఫాన్‌ను ఎదుర్కొంనేందుకు అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రత్యేకాధికారి, పీఎ్‌సవీపీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎమ్.వెంకటసత్యనారాయణ సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం పట్టణ, మండల పరిధిలోని కీలకమైన శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో అధిక వర్షాలు కురిసే అవకాశాలు మొండుగా ఉన్నాయని అన్నారు. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి గ్రామంలోని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. ముఖ్యంగా ప్రాణ, ఆస్తి, పశు నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ సిబ్బంది, మండల అధికారులు వారికి కేటాయించిన కేంద్రాల్లో అందుబాటులో ఉండాలన్నారు. చప్టాలు, వాగులు, నదుల వద్ద సిబ్బందిని ఉంచాలన్నారు. కంట్రోల్ రూం ఇప్పటికే ఏర్పాటైనందున ఎలాంటి చిన్నపాటి విపత్తు సంభవించినా వెంటనే అప్రమత్తం కావాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బీవీఎ్‌స.నారాయణరావు, తహసీల్దార్ కె.చిరంజీవి, పంచాయతీరాజ్ ఏఈ మోహన్‌రాజా, విద్యుత్ ఏఈ యశోద, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.