కరోనాపై అప్రమత్తం
ABN , Publish Date - May 25 , 2025 | 01:26 AM
కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొవిడ్-19 మార్గదర్శకాలను జారీచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రప్రభుత్వం కూడా వైద్యశాఖను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం, కడపల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్యారోగ్యశాఖ అధికారులు తగిన చర్యలకు సిద్ధమయ్యారు.
ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యశాఖకు ప్రభుత్వ ఆదేశం
ఇప్పటికే దిశానిర్దేశం చేసిన అధికారులు
త్వరలో టెస్టులు చేసేందుకు అందుబాటులోకి కిట్లు
ప్రైవేటు వైద్యశాలల ప్రతినిధులతోనూ చర్చలు
లక్షణాలు సాధారణమే అంటున్న వైద్యులు
కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొవిడ్-19 మార్గదర్శకాలను జారీచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రప్రభుత్వం కూడా వైద్యశాఖను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం, కడపల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్యారోగ్యశాఖ అధికారులు తగిన చర్యలకు సిద్ధమయ్యారు. ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు వైద్యులను అలర్ట్ చేయడంతోపాటు ప్రైవేటు వైద్యశాలల ప్రతినిధులతో కూడా కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కొవిడ్ నిబంధనలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా వైద్యసిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.
ఒంగోలు కలెక్టరేట్, మే 24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం అప్రమ త్తమైంది. వైద్యారోగ్యశాఖను అలర్ట్ చేసింది. ప్రధానంగా ఆలయాలు, బస్టాండులు, రైల్వేస్టేషన్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రజలకు గతంలో మాదిరిగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా జిల్లా వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ విషయంపై డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తగిన సూచనలు చేశారు. కరోనా లక్షణాలు వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కారడం లేదా ముక్కుదిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటివి ఉంటే నిర్ధారణకోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలి.
త్వరలో కిట్లు రాక
రాష్ట్రంలో చాపకింద నీరులా కేసులు నమోదవుతుండటంతో టెస్టులకు అవస రమైన కిట్లను ప్రభుత్వం త్వరలో జిల్లా లకు పంపనున్నట్లు సమాచారం. ప్రధా నంగా జ్వరం, జలుబు, దగ్గు ఉంటే అటువంటి వారిని వారంరోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉంచాలని వైద్యాధి కారులను ఆదేశించింది. అప్పటికీ జ్వ రం, తగ్గు, జలుబు తగ్గకపోతే వారికి వెంటనే కరోనా టెస్టు చేసి సమీపంలోని ఏరియా వైద్యశాలకు తరలించాలని సూ చించింది. ఇందుకు సంబంధించి ప్రజ లకు పూర్తిస్థాయి అవగాహన కల్పించే విధంగా వైద్యశాఖ కరపత్రాలను కూడా ప్రచురించి పంపిణీ చేయనుంది.
ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవీ..
సామూహిక ప్రార్థనలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, జనం ఒకచోట చేరే కార్యక్రమాలను నిలుపుదల చేయాలి.
రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలలో కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించాలి
వృద్ధులు (60 ఏళ్లు పైబడిన వారు), గర్భిణిలు ఇంటి లోపలే ఉండాలి
పరిశుభ్రత పాటించడంతోపాటు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి. దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు ముఖాన్ని తాకకుండా చూసుకోవాలి
అధిక ప్రమాదకర ప్రాంతాల్లో మాస్కు లు ధరించాలి. రద్దీగా ఉండే లేదా సరిగా వెంటిలేషన్ లేని ప్రదేశంలో ఉంటే మాస్క్ ధరించడం వల్ల వైరస్ వ్యాప్తిని తగ్గించొచ్చు.
కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.