Share News

పండుగకు వచ్చి మృత్యువాత..!

ABN , Publish Date - Dec 25 , 2025 | 11:05 PM

క్రిస్మస్‌ పండుగవేళ మండలంలోని తంగెళ్లలో విషాదచాయలు అలుముకున్నాయి. తంగెళ్ల-జగ్గిరాజుపాలేల మధ్య గురువారం రాత్రి ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి మోటార్‌సైకిల్‌ ఢీకొట్టిన ప్రమాదంలో ఎస్సీకాలనీకి చెందిన డేవిడ్‌(23) అక్కడికక్కడే మృతిచెందాడు.

పండుగకు వచ్చి మృత్యువాత..!

ట్రాక్టర్‌, మోటార్‌సైకిల్‌ ఢీ.. ఒకరు మృతి,మరొకరికి తీవ్రగాయాలు

తంగెళ్లలో విషాదచాయలు

మర్రిపూడి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి) : క్రిస్మస్‌ పండుగవేళ మండలంలోని తంగెళ్లలో విషాదచాయలు అలుముకున్నాయి. తంగెళ్ల-జగ్గిరాజుపాలేల మధ్య గురువారం రాత్రి ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి మోటార్‌సైకిల్‌ ఢీకొట్టిన ప్రమాదంలో ఎస్సీకాలనీకి చెందిన డేవిడ్‌(23) అక్కడికక్కడే మృతిచెందాడు. అదే వాహనంపై వెనుక ఉన్న మాతంగి రాఖీకి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరులో బేల్దారీ పనులు చేసుకుంటున్న డేవిడ్‌ క్రిస్మస్‌ పండుగ కోసం గ్రామానికి వచ్చాడు. స్నేహితుడితో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనాస్థలంలోనే డేవిడ్‌ మృతిచెందగా రాఖీకి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో కొండపి వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న హెడ్‌కానిస్టేబుల్‌ సీతారామిరెడ్డి ఘటనాస్థలానికి వెళ్లి ప్రమాదానికి కారణం తెలుసుకున్నాడు. రాఖీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమే్‌షబాబు తెలిపారు.


ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన ఆటో

ఓ విద్యార్థి మృతి.. నలుగురికి గాయాలు

మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వినుకొండ టౌన్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులోని ఓ ఆటో డ్రైవర్‌ దూసుకొచ్చి మూడు బైక్‌లను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన మార్కాపురం రోడ్డులోని చెక్‌పోస్టువద్ద గురువారం జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాలను పరిశీలిస్తే.. ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామానికి చెందిన గుంజి శ్రీహరి(14) తన సోదరుడు శ్రీకాంత్‌, బంధువు అయిన డేరంగుల అంకమ్మరావు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి వినుకొండ నుంచి మూడు బైకులపై మారెళ్ల వెళ్తున్నారు. చెక్‌పోస్టు సెంటర్‌లో టిఫిన్‌ కోసం ఆగగా మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ కొత్తా అంకమ్మరావు ఫోర్‌ వీల్‌ ఆటో దూసుకొచ్చి ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. దీంతో శ్రీహరి అక్కడికక్కడే మృతి చెందగా శ్రీకాంత్‌, డేరంగుల అంకమ్మరావు, రేణుక, అక్షిత, రెండేళ్ల చిన్నారి బాలమణికంఠ గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆటో డ్రైవర్‌ అంకమ్మరావును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. క్షతగాత్రులు వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు.

Updated Date - Dec 25 , 2025 | 11:05 PM