సాగుకు ప్రతికూలం
ABN , Publish Date - Aug 05 , 2025 | 02:08 AM
జిల్లాలో విభిన్న వాతావరణంతో రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. నాలుగైదు రోజులు భారీ వర్షాలు, ఆతర్వాత బెట్ట తీస్తుండటంతో సాగు కష్టంగా మారింది. ప్రస్తుత ఖరీఫ్ ప్రతికూలంగా సాగుతోంది. సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా కనీసం 15శాతం విస్తీర్ణంలో కూడా పైర్లు సాగుకు నోచుకోలేదు.
సీజన్ ప్రారంభమై రెండు నెలలు
15శాతం విస్తీర్ణంలో కూడా పడని విత్తనం
కీలక సమయంలో బెట్ట వాతావరణం
వేసవిని తలపిస్తున్న ఎండలు
వర్షాధార ప్రాంతంలో వేసిన పైర్లు వాడుముఖం
ఆందోళన చెందుతున్న రైతులు
సాగర్ నీటిపైనే కాస్తంత నమ్మకం
జిల్లాలో విభిన్న వాతావరణంతో రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. నాలుగైదు రోజులు భారీ వర్షాలు, ఆతర్వాత బెట్ట తీస్తుండటంతో సాగు కష్టంగా మారింది. ప్రస్తుత ఖరీఫ్ ప్రతికూలంగా సాగుతోంది. సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా కనీసం 15శాతం విస్తీర్ణంలో కూడా పైర్లు సాగుకు నోచుకోలేదు. చాలాచోట్ల విత్తనం పడలేదు. ఆగస్టు వచ్చినా బెట్ట వాతావరణం కొనసాగుతోంది. దీనికితోడు ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. ముందుగానే సాగర్ నీరు సరఫరా చేయడం ఆయకట్టు రైతుల్లో కాస్తంత పంటల సాగుపై నమ్మకం కలిగిస్తున్నప్పటికీ మెట్టప్రాంతంలో వర్షాధారంపై ఆధారపడిన వారు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే వేసిన పైర్లు వాడుముఖం పడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఒంగోలు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ప్రతికూల వాతావరణంతో జిల్లాలో ఖరీఫ్ సీజన్ సాగు ముందుకు సాగడం లేదు. సాధారణంగా ఈ సీజన్‌లో లక్షా 92వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు వేస్తారు. అందులో ఉద్యాన శాఖ పరిధిలోని మిర్చి, కూరగాయలు, పశుగ్రాసం ఇతరత్రా పంటలు పోను వ్యవసాయశాఖ పరిధిలో లక్షా 30వేల హెక్టార్లలో సాగవుతాయి. సీజన్ ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా కేవలం 17,285 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. అంటే వ్యవసాయ శాఖ పరిఽధిలో ఉండే ఖరీఫ్ సాధారణ విస్తీర్ణంలో కనీసం 15 శాతం కూడా ఈ రెండు నెలల్లో విత్తనం పడ లేదు. ప్రస్తుతం పెరిగిన ఎండలు, బెట్ట వాతావరణంతో వేసిన పైర్లు కూడా వాడుముఖం పడుతున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో ప్రధాన పంటలుగా కంది, వరి, పత్తి, సజ్జ వేస్తారు. అందులో ఒక్క కంది పంటనే దాదాపు 68వేల హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో సాగు చేస్తారు. అంటే ఖరీఫ్‌లో వ్యవసాయశాఖ పరిధిలో వేసే పంటల మొత్తం విస్తీర్ణం లక్షా 30వేల హెక్టార్లలో ఒక్క కంది పంటే సుమారు 53శాతం ఉంటుంది. అలాగే 27వేల హెక్టార్లు (25శాతం) పత్తి, 12,826 హెక్టార్లు (10శాతం) వరి, మరో 7,020 హెక్టార్ల(6శాతం) విస్తీర్ణంలో సజ్జ వేస్తారు. అంటే మొత్తం సాధారణ విస్తీర్ణంలో 94శాతం విస్తీర్ణంలో ఈ నాలుగు పంటలనే సాగు చేస్తారు. అందులో కంది, పత్తి పంటలు ప్రధానమైనవి.
రోహిణిలో వానలు.. తర్వాత ఎండలు
ఎండలు మండే రోహిణి కార్తెలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసి అనంతరం ఎండలు మండిపోతున్నాయి. మేలో 53.0 మి.మీ సాధారణ వర్షపాతానికి ఏకంగా 103 మి.మీ కురిసింది. సాగుకు ఉత్సాహంగా సిద్ధమైన రైతులు భూములను సిద్ధం చేశారు. ఆ తర్వాత జూన్‌లో బెట్ట వాతావరణం నెలకొంది. ఆ నెలలో 58 మి.మీ సాధారణ వర్షపాతం కాగా దాదాపు 35శాతం లోటుతో కేవలం 37.4 మి.మీ మాత్రమే పడింది. అది కూడా పంటల సాగుకు ఉపకరించలేదు. ఇక జూలైలో 87.9 మి.మీ సాధారణ వర్షపాతానికి 102.2 మి.మీ కురిసినా అందులో మూడొంతులకుపైగా జూలై 20 తర్వాత మూడు, నాలుగు రోజుల్లో పడింది. ఆ లోపు పంటల సాగు ముందుకు సాగకపోగా ఆ వర్షాల అనంతరం రైతులు పంటల సాగు కోసం భూములను సిద్ధం చేయడం ప్రారంభించారు. అయితే తిరిగి పది రోజులుగా జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో వాన జాడ కరువైంది. ఎండలు మండిపోతున్నాయి.
వాడుముఖం పట్టిన పైర్లు
ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగుకు వాతావరణం అనుకూలించలేదు. నిజానికి ఈ సమయానికి ప్రధాన పంటలైన కంది, పత్తి సగం విస్తీర్ణంలో వేసి మిగిలిన దానిలో ముమ్మరంగా విత్తనం వేస్తుంటారు. అయితే ఇప్పటి వరకూ కంది కేవలం 2శాతం విస్తీర్ణంలో కూడా సాగుకు నోచుకోలేదు. పత్తి 26శాతం విస్తీర్ణంలో వేశారు. ప్రస్తుతం నెలకొన్న బెట్ట వాతావరణం, పెరిగిన ఎండల తీవ్రతతో చాలాచోట్ల పత్తి వాడుముఖం పట్టింది. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్‌కు తొలుత పూర్తి సానుకూల పరిస్థితి నెలకొంది. జూన్ ఆరంభం నుంచి ఈ సీజన్ కాగా మే రెండో పక్షంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి.
40డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
మూడు నాలుగు రోజులుగా జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో 37 నుంచి 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. దీంతో ఇప్పటికే వేసిన పత్తి, ఇతర పంటలు కూడా వాడుముఖం పడుతున్నాయి. మొత్తం ప్రస్తుత సీజన్ వ్యవసాయశాఖ పరిధిలో లక్షా 30వేల హెక్టార్లలో ఈ సమయానికి కనీసం సగం విస్తీర్ణంలో సాగు కావాల్సి ఉన్నా 15శాతం కూడా విత్తనం పడలేదు. అంతేకాక ప్రస్తుతం బెట్ట వాతావరణంతో మెట్ట ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఉద్యానశాఖ పరిధిలో ప్రధానమైన మిర్చి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ సీజన్‌లో సుమారు 26వేల హెక్టార్లలో మిర్చి సాగు చేస్తారు. అయితే ఇప్పటివరకు అందులో 20శాతం కూడా నాట్లు పడకపోగా వేసిన చోట కూడా ఎండుముఖం పట్టాయి. సాగర్ ఆయకట్టు ప్రాంతంలో మాత్రం కొంత ఆశాజన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది కృష్ణమ్మ వరవళ్లతో నెలన్నర ముందుగానే సాగర్ డ్యామ్ నుంచి నీటి విడుదల చేయగా ఇప్పటికే ఆ నీరు జిల్లాకు చేరింది. దీంతో సాగుపై నమ్మకంతో ఆయకట్టు రైతులు పంటల సాగుకు సన్నద్ధం అవుతున్నారు.