పనితీరు మార్చుకోకుంటే చర్యలు
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:06 AM
పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను హెచ్చరించారు. గ్రామాలు, మునిసి పాలిటీల్లో ఏమి జరుగుతుందో.. అభివృద్ధి పనుల పురోగతి ఏ స్థాయిలో ఉందో కూడా కనీస అవగాహన లేకపోతే ఎలా? అంటూ మండిపడ్డారు. సమావేశాలకు పిలుస్తున్నప్పుడు కనీస సమాచారం లేకుండా ఎలా వస్తారని ప్రశ్నించారు.
అభివృద్ధి విషయంలో కనీస అవగాహన లేకపోతే ఎలా?
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించను
అధికారులకు కలెక్టర్ తమీమ్ అన్సారియా హెచ్చరిక
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను హెచ్చరించారు. గ్రామాలు, మునిసి పాలిటీల్లో ఏమి జరుగుతుందో.. అభివృద్ధి పనుల పురోగతి ఏ స్థాయిలో ఉందో కూడా కనీస అవగాహన లేకపోతే ఎలా? అంటూ మండిపడ్డారు. సమావేశాలకు పిలుస్తున్నప్పుడు కనీస సమాచారం లేకుండా ఎలా వస్తారని ప్రశ్నించారు. క్యాంపు కార్యాలయం నుంచి ఆమె సోమవారం సాయంత్రం ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా పలువురి పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రవర్తన మార్చుకోవాలన్నారు. లేనిపక్షంలో తీవ్ర పపరినామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆయా అంశాలపై సమీక్ష సమావేశంలో ఎంపీడీవోలు, కొందరు మునిసిపల్ కమిషనర్లు తెల్లముఖం వేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్న అధికారులే ఇలా ఉంటే కిందిస్థాయిలో పనిచేసే సచివాలయ సిబ్బందిని ఏవిధంగా పర్యవేక్షిస్తున్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చని అసహనం వ్యక్తం చేశారు పద్ధతి, ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో ఇప్పటికే 286 ఈకేవైసీ పెండింగ్ ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనితోపాటు హౌస్‌హోల్డ్ ఈకేవైసీ సర్వేను కూడా ప్రత్యేక డ్రైవ్ మోడ్‌లో చేపట్టాలన్నారు. చదువుకున్న యువతకు వర్క్ ఫ్రం హోం కింద ఉపాధి కల్పించేలా ప్రభుత్వం నిర్వహిస్తున్న కౌశలం సర్వేను కూడా పర్యవేక్షించాలని ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేసే విధంగా చూడాలన్నారు. గృహ నిర్మాణంలో ప్రతివారం స్పష్టమైన పురోగతి కనిపించాలన్నారు. ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. 15 రోజులకు ఒకసారి తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇంకుడు గుంతల పనులను 15 రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. వీసీలో వివిధ శాఖల అధికారులు చిరంజీవి, గొట్టిపాటి వెంకటనాయుడు, డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, శ్రీనివాసప్రసాద్, జోసఫ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.