Share News

వేటు మొదలైంది!

ABN , Publish Date - May 06 , 2025 | 01:37 AM

జిల్లా వైద్యారోగ్యశాఖలో ముఖహాజరును ఐఫోన్‌ ద్వారా ట్యాంపరింగ్‌ చేసిన కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించాలని ఆశాఖ డైరెక్టర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 4న ‘ముఖహాజరు మాయా జాలం.. విధులకు ఎగనామం’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో వైద్యశాఖలో అలజడి రేగింది.

వేటు మొదలైంది!

వైద్యశాఖ ఉద్యోగుల్లో అలజడి

ఐఫోన్‌లో ముఖహాజరును ట్యాంపరింగ్‌ చేసిన వారిపై హెల్త్‌ డైరెక్టర్‌ ఆగ్రహం

కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని ఆదేశం

ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్లపై చర్యలు

రెగ్యులర్‌ వారికి సంజాయిషీ నోటీసులు

ఒంగోలు కలెక్టరేట్‌, మే 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వైద్యారోగ్యశాఖలో ముఖహాజరును ఐఫోన్‌ ద్వారా ట్యాంపరింగ్‌ చేసిన కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించాలని ఆశాఖ డైరెక్టర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 4న ‘ముఖహాజరు మాయా జాలం.. విధులకు ఎగనామం’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో వైద్యశాఖలో అలజడి రేగింది. అక్రమాలకు పాల్పడ్డ ఉద్యోగులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు శ్రీకారం చుట్టింది. అందుకోసం వైద్యులు, సిబ్బంది ముఖ హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్‌)ను ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా వేసేవిధంగా చర్యలు తీసుకుంది. అయితే ప్రభుత్వం సాధారణ ఫోన్లకు యాప్‌ను రూపొందించగా జిల్లాలోని 16 మంది మెడికల్‌ ఆఫీసర్లు ఆ యాప్‌ను ఐఫోన్ల ద్వారా ట్యాంపరింగ్‌ చేశారు. వారు పనిచేసే చోట ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేయకపోయినా అక్కడే వేసినట్లు చూపించింది. ఈ విషయాన్ని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు గుర్తించి చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో కాంట్రాక్టు కింద ఇరువురు మెడికల్‌ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. ఐఫోన్‌ ద్వారా ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ట్యాంపరింగ్‌ చేయడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారిని తొలగించాలని డీఎంహెచ్‌వోను హెల్త్‌ డైరెక్టర్‌ ఆదేశించారు.

200 మంది ఉద్యోగులు కూడా..

మరోవైపు వైద్యశాఖలో సుమారు 200 మంది వరకు రెగ్యులర్‌ ఉద్యోగులు ఫోన్‌ ట్యాంపరింగ్‌ ద్వారా హాజరుతోపాటు విధులకు ఆలస్యంగా వెళ్తున్నట్లు గుర్తించారు. వారిలో కొందరు పనిచేసే వైద్యశాల వద్దకు వెళ్లి ముఖ హాజరు వేసి లోపల అడుగు పెట్టకుండానే తిరిగి సాయంత్రం ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేస్తున్నట్లు కూడా పసిగట్టారు. వారందరికీ సీసీఎల్‌ఏ రూల్‌ ప్రకారం సంజాయిషీ నోటీసులు జారీ చేయాలని డైరెక్టర్‌ ఆదేశించారు. దీంతో ఉద్యోగుల్లో అలజడి రేగింది. ఇప్పటివరకు ఇష్టానుసారంగా వ్యవహరించిన వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెగ్యులర్‌ వారిని కేవలం సంజాయిషీ నోటీసులతో వదిలేస్తారా? కఠిన చర్యలు తీసుకుంటారా? అన్న ఆందోళన వారిలో నెలకొంది. .

Updated Date - May 06 , 2025 | 01:37 AM