చీటింగ్ కేసులో నిందితుడి అరెస్టు
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:16 PM
చీటింగ్ కేసులో నిందితుడిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానమంత్రి నిరుద్యోగ భృతి రుణాలు మంజూరు చేయిస్తానని ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లికి చెందిన మాదాల సూర్యనారాయణను హైదరాబాద్‌కు చెందిన తోట బాలాజీనాయుడు మోసం చేసినట్లు కేసు నమోదైంది.
హైదరాబాద్ వాసిపై రెండు రాష్ట్రాల్లో 32 కేసులు
ఎర్రగొండపాలెం కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు
ఎర్రగొండపాలెం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : చీటింగ్ కేసులో నిందితుడిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానమంత్రి నిరుద్యోగ భృతి రుణాలు మంజూరు చేయిస్తానని ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లికి చెందిన మాదాల సూర్యనారాయణను హైదరాబాద్‌కు చెందిన తోట బాలాజీనాయుడు మోసం చేసినట్లు కేసు నమోదైంది. ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నాగరాజు ఆ కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 7న అయ్యంబొట్లపల్లికి చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు మాదాల సూర్యనారాయణకు నిందితుడు తోట బాలాజీనాయుడు ఫోన్‌చేసి తన పేరు సంజయ్‌కుమార్ అని, మీ మండలానికి ప్రధానమంత్రి నిరుద్యోగభృతి రుణాలు మంజూరయ్యాయని చెప్పారు. తాను విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పి నమ్మకం కలిగించాడు. దీంతో ఆయన చెప్పిన విధంగా సూర్యనారాయణ రూ.1,29,000ని బాలాజీనాయుడు చెప్పిన అకౌంట్‌కు జమ చేశారు. ఆ తర్వాత మోసపోయినట్లు గ్రహించిన సూర్యనారాయణ మిగిలిన నగదును నేరుగా ముట్టజెబుతానని చెప్పాడు. దీంతో బాలాజీనాయుడు గురువారం ఎర్రగొండపాలెం రాగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.1,29,000 స్వాధీనం చేసుకున్నారు. 2009లో ఎన్‌టీఎ్‌సలో ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ అవినీతి కేసులో ఉద్యోగం కోల్పోయినప్పటి నుంచి బాలాజీనాయుడు రెండు రాష్ట్రాలలో రాజకీయ నాయకులకు ఫోన్లు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని 50 మంది వరకు ఎమ్మెల్యేలను మోసం చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇతనిపై రెండు రాష్ట్రాల్లో 32 చీటింగ్ కేసులు నమోదైనట్లు చెప్పారు. ఇతను గత నెలలో నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యాడని తెలిపారు. సమావేశంలో సీఐ అజయ్‌కుమార్, ఎస్‌ఐ చౌడయ్య పాల్గొన్నారు.