వంచనకు గురైన యువతి బలవన్మరణం
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:37 PM
పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుకున్న యువతి వంచనకు గురై ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం ఒంగోలు నగరంలో చోటుచేసుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా..
పెళ్లికి కులం అడ్డు అంటూ యువకుడు అభ్యంతరం
సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్
ఒంగోలు క్రైం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుకున్న యువతి వంచనకు గురై ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం ఒంగోలు నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే... ఒంగోలుకు చెందిన ఓ యువతి(33 సంవత్సరాలు) ఎంటెక్ చదువుకొని ఇంటి వద్దే ఉంటుంది. సుమారు 12 ఏళ్ల క్రితం స్థానిక మహేంద్రనగర్‌కు చెందిన సింగోతు శ్రీనివాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. నువ్వు లేనిది నేను లేనంటూ నమ్మించాడు. తీరా పెళ్లి చేసుకోవాలని అడిగితే మన రెండు కులాలు వేరంటూ బుకాయించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి ఆదివారం తెల్లవారుజామున సూసైడ్ నోట్ రాసి మంచం పక్కన పెట్టుకొని చీరతో ఇంటి దూలానికి ఉరివేసుకొంది. తండ్రి ఉదయం 9.30 గంటలకు టిఫిన్ ఇవ్వడానికి వెళ్లగా తలుపు తీయలేదు. ఇరుగుపొరుగు వారి సహకారంతో తలుపు తెరిచి చూడగా కుమార్తె ఇంటి దూలానికి వేలాడుతుంది. తన కుమార్తె మరణానికి సింగోతు శ్రీనివాస్ కారణం అని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఒంగోలు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు పంపించారు.
బాలిక ఆత్మహత్య
ప్రేమ విఫలం కావటమే కారణం!
ఆలస్యంగా వెలుగులోకి ఘటన
దర్శి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఓ బాలిక ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంది. ఈసంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... సదరు బాలిక(16) దర్శిలోని ఓప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతుంది. తల్లిదండ్రులు, సోదరులు హైదరాబాద్‌లో బేల్దారీ పనులు చేస్తూ ఎక్కువ రోజులు అక్కడే ఉంటారు. అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఆ బాలిక ఉండి కళాశాలకు రోజూ వెళ్లివస్తుంది. ఈక్రమంలో నవంబరు 30న ఆరోగ్యం బాగాలేదని మందులు వేసుకున్నట్లు అమ్మమ్మకు చెప్పింది. ఈ నెల 1న పరిస్థితి ఇబ్బందిగా ఉండటంతో తాతయ్య, అమ్మమ్మలు పొదిలిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ఆ బాలిక ఎలుకల మందు తాగినట్టు చెప్పారు. వైద్యం చేసినప్పటికీ అదేరోజు సాయంత్రం మృతిచెందింది. ఆ బాలిక ఎలుకల మందు ఎందుకు తాగిందనే విషయం అప్పుడు తెలియలేదు. హైదరాబాద్ నుంచి తల్లిదండ్రులు వచ్చి కారణాలు తెలుసుకోగా అదే గ్రామానికి చెందిన సీహెచ్ నరేంద్ర అనే యువకుడు ప్రేమించినట్లు తెలుసుకున్నారు. ఆ యువకుడు పెళ్లి చేసుకునేందుకు నిరాకరించటంతో బాలిక ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. తొలుత ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం సెక్షన్లు మార్చి పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎం.మురళీ తెలిపారు.