వీరయ్యచౌదరి హత్యకు పక్కా పథకం
ABN , Publish Date - May 04 , 2025 | 01:29 AM
కిరాయి హంతకులను వినియోగించి పక్కా పఽథకం ప్రకారం టీడీపీ నేత వీరయ్యచౌదరిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఇసుక వ్యాపారి నెలరోజుల ముందుగానే మహారాష్ట్రలోని బలార్షాలో ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగే సమయంలో ఇసుక వ్యాపారి.. వీరయ్యచౌదరి కార్యాలయం ఎదురుగా కారు పార్కు చేసుకొని హంతకులకు సూచనలు ఇచ్చినట్లు సమాచారం.
రెండు నెలలుగా నిందితులు ఒంగోలులోనే మకాం
అంతా ఇసుక వ్యాపారి వ్యూహం ప్రకారమే
ఒంగోలు క్రైం, మే 3 (ఆంధ్రజ్యోతి): కిరాయి హంతకులను వినియోగించి పక్కా పఽథకం ప్రకారం టీడీపీ నేత వీరయ్యచౌదరిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఇసుక వ్యాపారి నెలరోజుల ముందుగానే మహారాష్ట్రలోని బలార్షాలో ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగే సమయంలో ఇసుక వ్యాపారి.. వీరయ్యచౌదరి కార్యాలయం ఎదురుగా కారు పార్కు చేసుకొని హంతకులకు సూచనలు ఇచ్చినట్లు సమాచారం. హత్యకు ముందు వీరయ్య తన కార్యాలయంలో కూర్చొని ఉన్న ఫొటో దుండగులకు చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఫొటో హంతక ముఠాకు ఎలా చేరింది అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కిరాయి హంతకులకు నేరచరిత్ర ఉండటంతో వారికి అనేక రకాలుగా ఇసుక వ్యాపారి సహకరించి హత్య చేసేందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. హత్యలో పాల్గొన్న హంతకులు పొరుగు జిల్లాలో నివాసం ఉంటున్న గృహాలను హత్యకు ముందు రెండురోజుల క్రితం ఖాళీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.
వీరయ్య హత్య తర్వాతే ఇసుక వ్యాపారి పరారీ
హంతకులు ఇద్దరూ రెండు నెలల ముందు నుంచే ఒంగోలులో మకాం వేశారు. ఎప్పటికప్పుడు వీరయ్యచౌదరి కదలికలను గమని స్తూ ఉన్నారని తెలిసింది. హత్య చేసిన తరువాత ఎటు వైపు పరారవ్వాలన్న అంశాన్ని స్పష్టంగా నిర్ధారించుకున్నారు. హత్యకు వారంరోజులు ముందుగా వారికి మరో ఇద్దరు తోడయ్యారు. ముందుగా రచించుకున్న పక్కా పథకాన్ని ఇసుక వ్యాపారి అమలు చేశారు. వీరయ్య చౌదరి మృతిచెందిన తర్వాతనే అతను ఒంగోలు నుంచి పరారైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.