పోలీసు అమరవీరులకు ఘన నివాళి
ABN , Publish Date - Oct 22 , 2025 | 01:07 AM
జిల్లావ్యాప్తంగా పోలీసు అమరవీరుల దినాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సర్కిల్ కేంద్రాలలో వివిధ వర్గాల వారితో అమరుల సేవలను కొనియాడుతూ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం, సమాజం కోసం పనిచేసి అమరులైన పోలీసులకు పలుచోట్ల ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, ఇతర వర్గాల వారు నివాళులర్పించారు.
జిల్లావ్యాప్తంగా ర్యాలీలు
ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు
ఒంగోలులో జోరువానలోనూ కార్యక్రమం
పాల్గొన్న మంత్రి డాక్టర్ స్వామి, ఎమ్మెల్యేలు ఉగ్ర, బీఎన్, కలెక్టర్, ఎస్పీ
ఒంగోలు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా పోలీసు అమరవీరుల దినాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సర్కిల్ కేంద్రాలలో వివిధ వర్గాల వారితో అమరుల సేవలను కొనియాడుతూ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం, సమాజం కోసం పనిచేసి అమరులైన పోలీసులకు పలుచోట్ల ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, ఇతర వర్గాల వారు నివాళులర్పించారు. కొన్ని చోట్ల వర్షం పడుతున్నా కార్యక్రమాలు కొనసాగాయి. ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, ఎమ్మెల్యేలు బీఎన్.విజయ్‌కుమార్, డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ వి.హర్షవర్థన్‌రాజు ఇతర పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం జరిగే సమయంలో నగరంలో జోరువాన కురిసింది. వర్షంలో తడుస్తూనే వారంతా అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్థూపం వద్ద నివాళులర్పించారు. పోలీసు అమరులను తలుచుకుంటూ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి స్వామి మాట్లాడుతూ ప్రజలు, సమాజం కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. అలాంటి వారు విధి నిర్వహణలో పలు కారణాలతో అమరులు అవుతున్నారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుంటున్నదని తెలిపారు. మార్కాపురంలో జరిగిన ర్యాలీలో అక్కడి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డీఎస్పీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే గిద్దలూరు, కంభం, వైపాలెం, పామూరు, కనిగిరి, దర్శి, పొదిలి, కొండపి, సింగరాయకొండ సర్కిల్ కేంద్రాలతోపాటు దోర్నాల, పుల్లలచెరువు ఇతర పలు మండల కేంద్రాల్లోనూ స్థానిక పోలీసు అధికారుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ర్యాలీలు జరిగాయి. వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు, రెవెన్యూ, ఇతర పలు శాఖల అధికారులు ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు.