మహిళా సాధికారత దిశగా ముందడుగు
ABN , Publish Date - Oct 21 , 2025 | 10:51 PM
వివిధ కారణాలతో ప్రభుత్వం నుంచి కుట్టుమిషన్లు రాకపోయినా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సొంత నిధులతో శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా అందించారు. మహిళా సాధికారత దిశగా ఎమ్మెల్యే ఉగ్ర ముందడుగువేసేందుకు ఇదే ఉదాహరణ అని రాష్ట్ర మంత్రి స్వామి కొనియాడారు.
కనిగిరిలో మంత్రి స్వామి, ఎమ్మెల్యే ఉగ్ర
ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ
కనిగిరి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): వివిధ కారణాలతో ప్రభుత్వం నుంచి కుట్టుమిషన్లు రాకపోయినా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సొంత నిధులతో శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా అందించారు. మహిళా సాధికారత దిశగా ఎమ్మెల్యే ఉగ్ర ముందడుగువేసేందుకు ఇదే ఉదాహరణ అని రాష్ట్ర మంత్రి స్వామి కొనియాడారు. మంగళవారం కనిగిరిలో అమరావతి హాలులో జరిగిన కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొని ఎమ్మెల్యే ఉగ్రతో కలిసి మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. గత ఏడాది నుం చి జనని చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని మంత్రి తెలుసుకున్నారు. గతంలో కుట్టుమిషన్లను ఉగ్ర అందించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వమే ఈకార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఏడాది పాటు కుట్టుశిక్షణ ఇచ్చినా ప్రభుత్వం వివిధ కారణాలతో మహిళలకు మిషన్లు అందజేయలేదు. దీంతో డాక్టర్ ఉగ్ర తన ట్రస్ట్ ద్వారా కుట్టుమిషన్ల పంపిణీకి శ్రీకారం పలికారు. మంగళవారం మంత్రి స్వామి చేతుల మీదుగా 140 మందికి వాటిని అందజేశారు. దీపావళి కానుకగా మహిళలకు కుట్టుమిషన్లు అందజేసిన మంత్రి, అధికారులు ఉగ్రను కొనియాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ నియోజకవర్గంలో మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దశంతో స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉచితంగా మిషన్లు కూడా పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. అలాగే వృద్ధాప్యంలో ఉన్న వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించడంతోపాటు ఉచిత వైద్యశిబిరాలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి, డీఎస్పీ సాయిఈశ్వర్ యశ్వంత్‌తోపాటు అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.