Share News

మార్కాపురం జిల్లాపై ముందడుగు

ABN , Publish Date - Oct 23 , 2025 | 02:20 AM

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడంలో దూకుడుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో బుధవారం ఉన్నతాధికారులు రంగంలోకి వచ్చి కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.

మార్కాపురం జిల్లాపై ముందడుగు
సీసీఎల్‌ఏ అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ

ప్రకాశంలోకి అద్దంకి, కందుకూరు

ఆమేరకు జిల్లాల కలెక్టర్లతో సీసీఎల్‌ఏ ఉన్నతాధికారుల సమీక్ష

నివేదికలు ఇవ్వాలని ఆదేశం

జనవరికే కొత్త జిల్లాలు వచ్చే అవకాశం?

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడంలో దూకుడుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో బుధవారం ఉన్నతాధికారులు రంగంలోకి వచ్చి కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి ప్రకాశం కలెక్టర్‌ రాజాబాబుకు.. కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశంలో కలిపేందుకు అవసరమైన నివేదికను ఇవ్వాలని నెల్లూరు, బాపట్ల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. దీంతో వచ్చే జనవరి నాటికే మార్కాపురం జిల్లా ఏర్పాటుతోపాటు ఒంగోలు కేంద్రంగా కొనసాగే ప్రకాశం జిల్లాలో అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను కలిపే అవకాశం ఉంది. బుధవారం కలెక్టర్లు, జేసీలు, ఇతర ముఖ్య రెవెన్యూ అధికారులతో సీసీఎల్‌ఏ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ఆయా అంశాలపై సమీక్ష చేశారు.

ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని గత వైసీపీ ప్రభుత్వం

గత వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలను పక్కనపెట్టి జిల్లాల పునర్విభజన చేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాలు 26కు పెంచింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాను మూడు జిల్లాల్లోకి విభజించారు. ఆ సందర్భంగా ప్రజలు వివిధ రకాల అంశాలను లేవనెత్తారు. బాపట్ల జిల్లాలో కలిసిన అద్దంకి, నెల్లూరు జిల్లాలో కలిసిన కందుకూరు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల వారు తమను ప్రకాశంలోనే ఉంచాలని డిమాండ్‌ చేశారు. పశ్చిమప్రాంత ప్రజలు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మొత్తుకున్నారు. ఈ రెండు అంశాలకు అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతుగా నిలవగా, అప్పటి అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా ప్రజల ఆకాంక్షలు సబబు అని భావించారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ ఇవేమీ పట్టించుకోకుండా తాను అనుకున్న ప్రకారం కొత్త జిల్లాల కార్యక్రమం ముగించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లాకు వచ్చిన ప్రస్తుత మంత్రి నారా లోకేష్‌ కందుకూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ కందుకూరును ప్రకాశం జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. పశ్చిమప్రాంతంలో పర్యటిస్తూ మార్కాపురం జిల్లా ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారు. అద్దంకిలో పర్యటించేటప్పుడు అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేత హోదాలో పశ్చిమ ప్రాంతానికి వచ్చిన చంద్రబాబునాయుడు మార్కాపురం, గిద్దలూరులలో జరిగిన సభల్లో తాము అధికారంలోకి వస్తే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కందుకూరు, అద్దంకిలను ఒంగోలులో చేరుస్తామని స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గిద్దలూరు వచ్చినప్పుడు జనసేన అధినేత, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కూడా మార్కాపురం జిల్లా ఏర్పాటుపై హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది అనంతరం ఆ విషయంపై దృష్టిపెట్టి జిల్లాల పునర్విభజనపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఆ ఉపసంఘం వివిధ రూపాల్లో సమాచారం సేకరించి ఒక నివేదికను రూపొందించింది. అందులో ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి సంబంధించి మార్కాపురం కేంద్రంగా ఆ జిల్లా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటు అద్దంకి అటు కందుకూరులను ప్రకాశం జిల్లాలో కలపాలని కూడా సూచించారు.

కీలక దశ ఆరంభం

రాజకీయ హామీలు, మంత్రివర్గ ఉపసంఘాలు ఎన్ని నివేదికలు ఇచ్చినా చట్టప్రకారం పని పూర్తిచేయాల్సింది అధికార యంత్రాంగమే. అది ఎప్పుడు జరుగుతుందో అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఈ దశలో బుధవారం నాటి పరిణామం ఈ వ్యవహారం తుది దశకు చేరిన సంకేతాన్ని వెల్లడించింది. సీసీఎల్‌ఏ కమిషనర్‌ లక్ష్మి, అదనపు కమిషనర్‌ మురళి నిర్వహించిన వీసీలో సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌లను ప్రస్తావిస్తూ జిల్లాల పునర్వస్థీకరణ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారని కలెక్టర్లకు తెలిపారు. ఆ సందర్భంలో ప్రకాశం జిల్లా కలెక్టర్‌ను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రస్తావించారు. మార్కాపురంతోపాటు గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాలను ఆ జిల్లాలో భాగస్వామ్యం చేయాలన్న ఆలోచనను తెలిపారు. తదనుగుణంగా మండలాలు, గ్రామాల వారి పరిస్ధితిని సమీక్షించింది. ప్రభుత్వ భూములు, అటవీశాఖ భూములు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకోండి. తదనుగుణంగా మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీ, భూపరమైన హద్దులను తెలిపే నివేదికలను పంపాలని ఆదేశించారు. అది రెండు, మూడు రోజుల్లోనే అందాలని ప్రత్యేకంగా ఆదేశించటం విశేషం. అద్దంకి, కందుకూరులను ప్రకాశం జిల్లాలోకి కలపాల్సిన అవసరం ఉందని ఆ రెండు నియోజకవర్గాలు, గ్రామాలు, మండలాల వారి హద్దులు భౌగోళిక సరిహద్దులు గుర్తించి వెంటనే నివేదిక పంపాలని బాపట్ల, నెల్లూరు జిల్లాల కలెక్టర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు.

ఎప్పుడైనా జరగవచ్చు

ఉన్నతాధికారుల ఆదేశాలను పరిశీలించినా, మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నా వచ్చే జనవరికే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కలెక్టర్లను రెండు, మూడు రోజుల్లోనే నివేదికలు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే నివేదికలు సిద్ధం చేసింది. వివిధ రకాల సాంకేతిక సమస్యలతో ఈ విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించనుందనే ప్రచారం ఉండనే ఉంది. దీంతో ఈ విషయంపై మంత్రివర్గ ఉపసంఘంలోని మంత్రిని సంప్రదించగా మా పని పూర్తయింది.. ఇప్పుడు యంత్రాంగం పని ప్రారంభమవుతుంది.. వచ్చే జనవరికే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగినా ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదు.. కానిపక్షంలో వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా పూర్తవుతుందని తెలిపారు.

Updated Date - Oct 23 , 2025 | 02:20 AM