Share News

కొంచెం మార్పు

ABN , Publish Date - Nov 20 , 2025 | 01:14 AM

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో సెక్షన్‌ 51 విచారణ మూడో విడత బుధవారం సాగింది. విచారణాధికారైన సహకారశాఖ అడిషనల్‌ కమిషనర్‌ గౌరీశంకర్‌ ఉదయం బ్యాంకుకు వచ్చి రుణ మంజూరులపై దృష్టి సారించారు.

కొంచెం మార్పు

డీసీసీబీలో మూడో విడత విచారణ

రుణాల మంజూరుపై విచారణాధికారి దృష్టి

వెంట ఒక సహాయక అధికారితో రాక

ఒంగోలు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో సెక్షన్‌ 51 విచారణ మూడో విడత బుధవారం సాగింది. విచారణాధికారైన సహకారశాఖ అడిషనల్‌ కమిషనర్‌ గౌరీశంకర్‌ ఉదయం బ్యాంకుకు వచ్చి రుణ మంజూరులపై దృష్టి సారించారు. తొలి రెండు విడతలు తూతూమంత్రంగా విచారణ చేసిన ఆయన ఈ విడత కాస్తంత లోతుగానే పరిశీలన ప్రారంభించినట్లు సమాచారం. అంతేకాక తొలి రెండుసార్లు విచారణ ప్రక్రియలో తనకు సహాయకులుగా కమిషనర్‌ నియమించిన ఇద్దరు అధికారులు లేకుండా వచ్చిన ఆయన ఈసారి అందులో ఒక అధికారిని వెంట తెచ్చుకున్నారు. డీసీసీబీలో వైసీపీ ప్రభుత్వ కాలంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని కలెక్టర్‌ ఇచ్చిన నివేదికపై సెక్షన్‌ 51 విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం విదితమే. నాలుగు నెలల్లో విచారణ పూర్తిచేసి నివేదించాలని ఈ ఏడాది ఆగస్టు ఆఖరులో సహకారశాఖ అదనపు కమిషనర్‌ గౌరీశంకర్‌ (విచారణా ధికారి)ను ఆఉత్తర్వుల్లో ఆదేశిస్తూ మరో ఇద్దరిని సహకారశాఖ ద్వితీయ, తృతీయ శ్రేణి అధికారులను సహాయకులుగా కమిషనర్‌ నియమించారు. తదనుగుణంగా సెప్టెంబరు 9, 10 తేదీల్లో తొలి విడత, అదే నెల 16వతేదీన రెండోసారి విచారణ చేశారు. అయితే ఆ రెండు విడతల్లోనూ లోతుగా పరిశీలన మాట అలా ఉంచి కనీస స్థాయిలో కూడా విచారణ చేయలేదని, ఒకరకంగా బ్యాంకులో అక్రమాలకు పాల్పడిన వారి కనుసన్నల్లో మొక్కుబడి తంతుగా పరిశీలన చేసి వెళ్లారన్న ఆరోపణలు అప్పుడే వచ్చాయి. అదే విషయాన్ని నాడు ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించింది.

విచారణాధికారిని మార్చాలని ఫిర్యాదులు

విచారణాధికారి తీరుపైన ప్రభుత్వానికి జిల్లా నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వెళ్లడంతోపాటు అతనిని మార్చాలని ఏకంగా కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలోని డీసీసీబీలలో వైసీపీ హయాంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై శాసనసభా సంఘం ఏర్పాటైంది. ఈనెల 3న సమావేశమైన ఆ కమిటీ పలు అంశాలపై కోరిన వివరణలతో సహకారశాఖ అధికారులు గందరగోళ పడుతున్నట్లు సమాచారం. దీంతో విచారణాధికారికి ప్రభుత్వం ఇచ్చిన గడువు కూడా ముగిసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో గౌరీశంకర్‌ బుధవారం మరోసారి విచారణకు వచ్చారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తొలి రెండు విడతలకు భిన్నంగా ఈసారి విచారణాధికారి వ్యవహరించారు. తొలుత కమిషనర్‌ నియమించిన ఇతర అధికారులు లేకుండా ఒక్కడే విచారణకు రాగా ఈసారి అందులో ఒకరైన జయరాజ్‌ అనే అధికారిని వెంట తీసుకువచ్చారు. అంతేకాక ఆ రెండు విడతల్లో కాలక్షేప చర్యలతో సాగిన ఆయన.. ఈసారి ఆరోపణలలో ప్రధానమైన రుణాల మంజూరు అంశంపై దృష్టి సారించారు. తనతో వచ్చిన సహకారశాఖ అధికారి జయరాజ్‌, బ్యాంకు సీఈవో, మరో ఒకరిద్దరు కీలక ఉద్యోగులతో మధ్యాహ్నం వరకు రుణ మంజూరు, వాటిలో చోటుచేసుకున్న అక్రమాల పరిశీలన వంటి అంశాలపైనే ఆయన సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

లబ్ధిదారులకు నోటీసులు.. ఆపై పరిశీలన

ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో బ్యాంకు ద్వారా ఇచ్చిన జగనన్న పాల వెల్లువ, జగనన్న తోడు, స్వయం సహాయక బృందాలు, జేఎల్‌జీ రుణాలు, ఇతర రైతులకు రుణాలు ఎంతెంత ఇచ్చారు? అన్ని అర్హులకే ఇచ్చారా, కాగితాలపై చూపేదానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితి తేడాలు ఉన్నాయా? ఉంటే వాటిని గుర్తించడం ఎలా? వంటి అంశాలపై చర్చించిన ఆయన లబ్ధిదారులందరికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. తద్వారా బోగస్‌ లబ్ధిదారులను గుర్తించవచ్చన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అలాగే సహకారశాఖలోని ఆడిటర్లను జిల్లాలోని వివిధ బ్యాంకు బ్రాంచిలకు పంపి నిబంధనల ప్రకారమే రుణాలు ఇచ్చారా? గడువులోపు చెల్లింపులు జరగని రుణాలకు సంబంధించి లీగల్‌గా చర్యలు తీసుకున్నారా..? తదితరాలు పరిశీలించి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్న దానిపై దృష్టిసారించినట్లు సమాచారం. మొత్తం మీద తొలి రెండు సార్లు తూతూమంత్రంగా వ్యవహరించిన విచారణాధికారి ఈసారి కాస్తంత లోతుగానే వివిధ అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఈ అక్రమాలలో భాగస్వామ్యులుగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నవారు ఒకింత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. వారిలో ప్రస్తుతం బ్యాంకులో అనధికారికంగా పెత్తనం చేస్తున్నట్లు భావిస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం..

Updated Date - Nov 20 , 2025 | 01:14 AM